ఉత్తర కొరియాలో హ్యాకర్లు

ఉత్తర కొరియాలో హ్యాకర్లు

సాంకేతికతలోనూ గోప్యత పాటించే ఉత్తర కొరియాలో హ్యాకర్లు చెలరేగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదీ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హెచ్చరికలను లెక్కలేయకుండా!. చాలా కాలంగా సొంత దేశం, వినోదరంగంపై మాత్రమే ఫోకస్‌ హ్యాకర్లు.. ఈ మధ్యకాలంలో ప్రపంచం మీద పడ్డారు.

2021 ఒక్క ఏడాదిలో ఏకంగా 400 మిలియన్‌ డాలర్ల విలువైన డిజిటల్‌ ఆస్తుల్ని కాజేశారు. వివిధ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌పై ఏడు దాడుల ద్వారా ఈ మొత్తం కాజేసినట్లు బ్లాక్‌చెయిన్‌ అనాలసిస్‌ కంపెనీ ‘చెయినాలైసిస్‌’ ప్రకటించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలను లక్క్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తమ దేశంలో హ్యాకర్లు లేరని, అలాంటి వాళ్లు దొరికితే మరణశిక్ష నుంచి తప్పించుకోలేరంటూ స్వయంగా అధ్యక్షుడు కిమ్‌ పలు సందర్భాల్లో బయటి దేశాలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లజారస్‌ గ్రూప్‌’.. నార్త్‌ కొరియా ఇంటెలిజెన్సీ బ్యూరో వెన్నుదన్నుతోనే నడుస్తోందని అనుమానాలు ఉన్నాయి. తద్వారా వెనకాల నుంచి ప్రొత్సహిస్తూ.. కిమ్‌ ప్రభుత్వం ఈ తతంగం నడిపిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ గ్రూప్‌ మీద కఠిన ఆంక్షలు విధించింది.

ఇక ఉ.కొరియాలో 2020-2021 మధ్య.. నాలుగు నుంచి ఏడు శాతానికి సైబర్‌ నేరాలు పెరగ్గా.. దొచుకున్న సొత్తు విలువ సైతం 40 రెట్లు అధికంగా ఉందని చెయినాలైసిస్‌ చెబుతోంది. కిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో 1.3 బిలియన్‌ డాలర్ల డబ్బు, క్రిప్టోకరెన్సీని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు నార్త్‌ కొరియన్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామర్లపై నేరారోపణ అభియోగాల్ని నమోదు చేసింది. చిన్న చిన్న కంపెనీల దగ్గరి నుంచి హాలీవుడ్‌ ప్రముఖ స్టూడియోలు లక్క్ష్యంగా ఈ సైబర్‌ దాడి జరిగినట్లు అమెరికా న్యాయ విభాగం సైతం నిర్ధారించుకుంది.