Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. నృత్యాలు చేస్తూ… బాణాసంచా పేలుస్తూ ప్రజలు వేడుక చేసుకున్నారు. ప్యాంగ్యాంగ్ లోని కిమ్ ఈ సంగ్ స్క్వేర్ వద్ద జరిగిన సంబరాల్లో వేల సంఖ్యలో సైనికులు పాల్గొన్నారు. అధికార పార్టీ నిర్ణయాత్మక కమిటీ వైస్ చైర్మన్ పాక్ క్వాంగ్ హో నేతృత్వంలో ఈ సంబరాలు జరిగాయి. ఉత్తరకొరియా ప్రజల సంతోషానికి, సంబరానికి కారణం రెండు రోజుల క్రితం ఆ దేశం ప్రయోగించిన శక్తిమంతమైన హ్వాసంగ్ 15 ఖండాంతర క్షిపణి. అమెరికాలోని ఏ ప్రాంతాన్నయినా సర్వనాశనం చేయగల శక్తి ఆ క్షిపణికి ఉందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉత్తరకొరియాలో ఆనందం మిన్నంటింది. సైనికులు, సాధారణ ప్రజలన్న తేడాలేకుండా అందరూ ఉత్తరకొరియా వీధుల్లోకొచ్చి ఉత్సాహంగా గడిపారు. ఈ విషయాన్ని ప్యాంగ్యాంగ్ అధికారిక మీడియా వెల్లడించింది.
అధికార పార్టీకి చెందిన పత్రికలోనూ ప్రజల వేడుకలకు సంబంధించిన చిత్రాలను ప్రచురించారు. కిమ్ ఈ సంగ్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న క్వాంగ్ హో అమెరికాను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశ అణుశక్తిని చూసి అమెరికా వణికిపోయిఉంటుందని, ఇక ఎతమ దేశ హక్కులను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. అటు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరిపిన ప్రాంతంలో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని దక్షిణ కొరియా ప్రభుత్వం వెల్లడించింది. పంగ్యేరి న్యూక్లియర్ సైట్ కు 2.7 కిలోమీటర్ల దూరంలో 2.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు దక్షిణ కొరియా తెలిపింది. శక్తిమంతమైన అణు పరీక్షలు జరిపినప్పుడు ఇలాంటి ప్రకంపనలు సహజమని భూ విజ్ఞాన అధికారులు చెబుతున్నారు.