ఉత్త‌ర‌కొరియాకు క్యూబా మ‌ద్ద‌తు…

cuba support to North korea kim Jong un want to war on trump

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ‌త్రువుకు శ‌త్రువు మ‌న‌కు మిత్రుడు అన్న‌సామెత అంత‌ర్జాతీయ సంబంధాల‌కు బాగా వ‌ర్తిస్తుంది. వ‌రుస అణుప‌రీక్ష‌ల‌తో అంత‌ర్జాతీయంగా ఏకాకిగా మారిన ఉత్త‌ర‌కొరియాకు అమెరికా శ‌తృదేశం క్యూబా విస్ప‌ష్ట‌మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఉత్త‌ర‌కొరియాపై అమెరికా అనుస‌రిస్తున్న విధానాన్ని క్యూబా తీవ్రంగా తప్పుప‌ట్టింది. ఎలాంటి చ‌ర్చ‌లూ లేకుండా ఆంక్ష‌లు విధించ‌డం, ఉత్త‌కొరియాను ఉగ్ర‌వాద దేశాల స‌ర‌స‌న చేర్చ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని అభిప్రాయ‌ప‌డింది. అమెరికాతో వివాదం నేప‌థ్యంలో ఉత్త‌ర‌కొరియా విదేశాంగ మంత్రి క్యూబాలో ప‌ర్య‌టించారు. రాజ‌ధాని హ‌వానాలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు స‌మావేశ‌మై దీనిపై చ‌ర్చించారు. అమెరికా ఏక‌ప‌క్ష‌, నిర్హేతుక‌మైన డిమాండ్ల‌ను ఖండిస్తున్నామ‌ని ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌జ‌ల సార్వ‌భౌమాధికారాన్ని గౌర‌వించాల‌ని, శాంతియుత‌మైన ఒప్పందాల ద్వారా వివాదాల‌కు ముగింపు ప‌ల‌కాల‌ని క్యూబా విదేశాంగ మంత్రి సూచించారు.

kim Jong un want to war on trump

అటు ఉత్త‌ర‌కొరియా అణుదాడికి సిద్ధ‌మ‌వుతోందంటూ అంత‌ర్జాతీయంగా వార్త‌లొస్తున్నాయి. ఈ మేర‌కు అధ్య‌క్షుడు కిమ్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చిన‌ట్టు తెలుస్తోంది. అమెరికా, ద‌క్షిణ కొరియా, జ‌పాన్, గ్వామ్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల‌ను కిమ్ ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్టు యూరోపియ‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఫారిన్ రిలేష‌న్స్ వెల్ల‌డించింది. ఉత్త‌ర‌కొరియా అధికారిక మీడియా సంస్థ‌లో ఉన్న సోర్సెస్ ద్వారా ఈ స‌మాచారాన్ని సంపాదించ‌గ‌లిగామ‌ని తెలిపింది. ఈ స‌మాచారం ప్ర‌కారం అమెరికాలోని న్యూయార్క్, మాన్ హ‌ట్ట‌న్, పెంట‌గాన్, వైట్ హౌస్ తో పాటు ఇత‌ర ముఖ్య‌న‌గ‌రాల‌ను కిమ్ టార్గెట్ చేసుకున్నారు. అలాగే జ‌పాన్ లో రాజ‌ధాని టోక్యో, క్యోటో, ఒసాకా, మిసావా, మోకోహామా న‌గ‌రాలు, దక్షిణ కొరియాలో రాజ‌ధాని సియోల్, బుసాన్, గ్యాంనెయంగ్ తో పాటు గ్వామ్ దీవుల‌పై అణుదాడి జ‌రిగే అవ‌కాశ‌ముంది. ఈ వార్త‌ల నేప‌థ్యంలో ఉత్త‌ర‌కొరియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. త‌మ దేశానికి చెందిన శ‌క్తివంత‌మైన ఎఫ్ -22 యుద్ధ విమానాలను ద‌క్షిణ కొరియాకు పంపించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. డిసెంబ‌రు 4 నుంచి జ‌ర‌గ‌నున్న అమెరికా, ద‌క్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో ఈ విమానాలు పాల్గొన‌నున్నాయి. ఈ విష‌యాన్ని ద‌క్షిణ కొరియా అధికారిక వ‌ర్గాలు ధృవీక‌రించాయి. ఉత్త‌ర‌కొరియాపై మరింత ఒత్తిడిని పెంచే ల‌క్ష్యంలో భాగంగానే అమెరికా, ద‌క్షిణ కొరియా ఈ సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి.