Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా, అమెరికా మధ్య యుద్ధం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరకొరియా యుద్ధానికి శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. సముద్ర తీరప్రాంతం నుంచి యుద్ధప్రాతిపదికన ప్రజలను ఖాళీచేయిస్తున్నారు. రాత్రిపూట శత్రువులకు టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో నగరాలకు రాత్రి వేళల్లో కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఉత్తరకొరియా నగరాలు రాత్రి వేళ అంధకారంలో మగ్గుతున్నాయి. యుద్ధ సన్నాహాల్లో భాగంగా కసరత్తులు జరుగుతున్నాయని, ఏ ఆయుధాన్ని ఎక్కడ నుంచి ప్రయోగించాలన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చామని, ఆయా ప్రాంతాలకు ఆయుధాలను తరలించడం కూడా పూర్తయిందని ఉత్తరకొరియా వార్తా సంస్థ ఎన్కే న్యూస్ పేర్కొంది. ఉత్తరకొరియా చర్యలు ప్రపంచ వ్యాప్తంగా అలజడి కలిగిస్తున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాలో అయితే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్యకాలంలో ఉత్తరకొరియా ఇలా యద్ధ సన్నాహకాలు ఎప్పుడూ చేయలేదని దక్షిణ కొరియా వ్యాఖ్యానించింది. అణ్వాయుధ భయాలను ఉత్తరకొరియా పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరకొరియా మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటోంది. తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను గద్దె దించాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అదే జరిగితే తాము అణుదాడికి దిగుతామని హెచ్చరిస్తోంది.