Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా భూభాగంపై అణ్వస్త్ర దాడి చేస్తామని కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న ఉత్తరకొరియా తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఒకే రోజు మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కొరియన్ పెవిన్సులాకు తూర్పున ఉన్న సముద్రంలోకి ఉత్తరకొరియా ఈ మూడు క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ మూడు ప్రయోగాలు విఫలమయ్యాయని అమెరికా పసిఫిక్ కమాండ్ తెలిపింది. ఈ క్షిపణుల లక్ష్యం అమెరికా భూభాగమైన గువామ్ కాదని వెల్లడించింది. ఈ ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అన్ని వివరాలు అందించామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ చెప్పారు.
ఉత్తరకొరియా పరీక్షించి చూసిన వన్నీ…తక్కువ శ్రేణి క్షిపణులని, మొదటి, రెండు క్షిపణులు విఫలమయ్యాయని, ఇక మూడో క్షిపణి ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే పేలిపోయిందని పసిఫిక్ కమాండ్ వివరించింది. అమెరికాను లక్ష్యంగా చేసుకున్నవి కాకపోయినప్పటికీ.ఉత్తర కొరియా నిర్వహించిన ఈ క్షిపణి ప్రయోగాలు….పరిస్థితులను ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. గత నెలలో ఖండాంతర క్షిపణి ప్రయోగించి అమెరికా ప్రధాన భూభాగాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఆ క్షిపణికి ఉందని హెచ్చరించిన ఉత్తరకొరియా..అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఎదురయినా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు.
గువామ్ పై క్షిపణి దాడి హెచ్చరిక చేస్తూ…రోజుకో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. రెండు రోజుల క్రితం తాము క్షిపణి దాడిచేస్తే అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ యానిమేటెడ్ వీడియో విడుదల చేసింది. ప్రపంచంలో అందరికన్నా తమను తాము గొప్పవాళ్లుగా భావిస్తున్న అమెరికా ప్రజల పొగరును తాము అణిచివేస్తామని తీవ్ర పదజాలంతో దూషించింది.
అంతకుముందు రెండు దేశాల మధ్య కాస్త చల్లారిన ఉద్రిక్తతలు తాము దాడిచేస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందంటూ.. అమెరికా రక్షణమంత్రి చేసిన హెచ్చరికలతో మళ్లీ వేడెక్కాయి. తాజాగా ఉత్తరకొరియా నిర్వహించిన ప్రయోగాలతోఅంతర్జాతీయంగా ఎప్పుడేం జరుగతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలు: