Posted [relativedate] at [relativetime time_format=”H:i”] i
వరుస క్షిపణ పరీక్షలపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందించారు. సైనిక శక్తిలో అమెరికాతో సమ ఉజ్జీ అని నిరూపించేందుకే క్షిపణి పరీక్షలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. తాజా క్షిపణి ప్రయోగంతో ఉత్తరకొరియా అణుకార్యక్రమం ఆగదని పెద్ద దేశాలకు చూపించామని తెలిపారు. ఈ పరీక్షలతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా సైనిక చర్య అనే మాట మాట్లాడేందుకు కూడా ధైర్యం చేయదన్నారు. అటు దేశ అణుఅవసరాలను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కిమ్ ప్రతిజ్ఞ చేసినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికాతో, పొరుగుదేశం దక్షిణకొరియాతో దశాబ్దాల వైరం ఉన్న ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చుబెడుతోంది.
సోవియట్ యూనియన్ కొన్ని దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన స్కడ్ క్షిపణి ఆధారంగా పరిశోధనలు ప్రారంభించిన ఉత్తరకొరియా ఆ తర్వాత చాలాసార్లు స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను పరీక్షించింది. ఉత్తరకొరియా అణుపరీక్షల వెనక చైనా, పాకిస్థాన్ సహకారం ఉందన్నది బహిరంగ సత్యం. దేశ ఉత్సవాల్లో అనేక సార్లు ఉత్తరకొరియా తన ఆయుధ సంపదను ప్రదర్శించింది. మరోవైపు కొన్నిరోజుల క్రితం హైడ్రోజన్ బాంబును ప్రయోగించిన ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించేలా చేసిన అమెరికా…కిమ్ తీరును నిశితంగా గమనిస్తోంది. హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ఏ క్షణమైనా అమెరికాపై దాడి జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని కిమ్ సంకేతాలు ఇచ్చారని అమెరికా మాజీ సైనికాధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో జరిపిన క్షిపణి పరీక్షలతో పోలిస్తే ఈ ప్రయోగం కచ్చితత్వం అధికమని అభిప్రాయపడ్డారు.
దాదాపు 2,300 మైళ్ల ఎత్తులో ప్రయాణించిన మిస్సైల్ పసిఫిక్ మహాసముద్రంలో పడిందని, అమెరికాలోని గువామ్ ప్రాంతానికి ఇది అత్యంత సమీపంలోకి వచ్చిందని వారు తెలిపారు. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని తక్కువగా అంచనావేసిన అమెరికాకు ఇది షాకిచ్చే అంశమని వారు చెప్పారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తమపై దాడికి దిగే సత్తా కిమ్ సమకూర్చుకున్నారని, గువామ్ తో పాటు అమెరికాలోని ప్రధాన భూభాగాలపైకి ఉత్తరకొరియా క్షిపణులు చేరుకోవచ్చని తాజాగా అమెరికా అంచనా వేస్తోంది. ఆగస్టు మొదటి వారంలో గువామ్ పై దాడికి దిగుతామని హెచ్చరికలు చేసిన కిమ్ ఆపై మౌనంగా ఉండటం వెనక ఏదో కారణం ఉందని, అమెరికాపై భారీస్థాయిలో దాడికి ఉత్తరకొరియా వ్యూహం పన్నుతోందని అగ్రరాజ్యం భావిస్తోంది.