Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తాము తలచుకుంటే ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఉత్తరకొరియా కుక్క అరుపులతో పోల్చింది. ఇటువంటి అరుపులను తాము పట్టించుకోబోమని ఉత్తరకొరియా విదేశాంగమంత్రి రీ యాంగ్ హో అన్నారు. ఐక్యరాజ్యసమితి వేదికగా తొలిసారి ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్షిపణి దాడులు చేస్తామంటూ అమెరికాను హెచ్చరిస్తున్న ఉత్తరకొరియాను సర్వనాశనం చేసే శక్తి తమకు ఉందని మండిపడ్డారు. ఉత్తరకొరియా వరుసక్షిపణి ప్రయోగాలు అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ కోరారు. ఈ నేపథ్యంలో ఐరాస సమావేశాల కోసం న్యూయార్క్ వచ్చిన ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. కుక్కల అరుపులు కొనసాగుతున్నా….తమ నడక ఆగదని తనను చుట్టుముట్టిన అంతర్జాతీయ విలేకరులతో వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాను ఒంటరిని చేయాలన్న ఏ దేశపు ఎత్తుగడలూ సాగబోవని, తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసని రీ యాంగ్ హూ చెప్పారు.
అణు క్షిపణి సామర్థ్యం పెంచుకోవాలన్న నిర్ణయం తమ దేశ భద్రత కోసమేనని, ఎన్నో దేశాలు తమకు మద్దతుగా ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. అటు ఐరాసలో ట్రంప్ వ్యాఖ్యలను ఉత్తరకొరియా మిత్రదేశం చైనా కూడా తప్పుపట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఎలాంటి ఉపయోగం లేదని ఆ దేశం అభిప్రాయపడింది. శాంతిని కాంక్షించేలా కాకుండా..మరింత రెచ్చగొట్టేలా మాట్లాడడం ద్వారా ట్రంప్ ఏం సాధించారని చైనా అధికార పత్రికల్లో ఒకటైన పీపుల్స్ డైరీ తన సంపాదకీయ పేజీలోని ప్రత్యేక కథనంలో ప్రశ్నించింది. ట్రంప్ ప్రసంగం తర్వాత ఉత్తరకొరియా మరిన్ని కీలకనిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, ఆ దేశంలో భయం పెరిగే కొద్దీ క్షిపణి పరీక్షలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని ట్రంప్ మరిచారని చైనా హెచ్చరించింది. ఆచితూచి వ్యవహరించాల్సిన అగ్రదేశం, మరింత రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్ అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షల వెనక చైనా ఉందని వస్తున్న విమర్శలనూ ఆయన ఖండించారు. అంతర్జాతీయ సమాజానికి చైనాను ఓ బూచీగా చూపే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు.