Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భద్రతా మండలి కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉత్తరకొరియా అమెరికా, జపాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమపై ఐక్యరాజ్యసమితి కఠిన ఆంక్షలు విధించేలా చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఇంతకుముందే హెచ్చరించిన ఉత్తరకొరియా మరో అడుగు ముందుకువేసి అణ్వాయుధాల ప్రయోగిస్తామని ప్రకటించింది. జపాన్ ఇక ఎంతో కాలం తమకు దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదని, ఆ దేశానికి చెందిన నాలుగు ద్వీపాలను అణుబాంబులు వేసి సముద్రంలో ముంచివేస్తామని, అమెరికా ప్రధాన భూభాగాలను బూడిద చేస్తామని, అమెరికా అంధకారంలో మగ్గుతుందని హెచ్చరించింది. ఈ మేరకు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది.
ఆంక్షలు విధించిన భద్రతామండలితో తెగదెంపులు చేసుకుంటామని ఉత్తరకొరియా ఆసియా-పసిఫిక్ కమిటీ తెలిపింది. అమెరికా ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇతర దేశాలు భద్రతామండలిలో తమపై కఠిన ఆంక్షల తీర్మానాన్ని ఆమోదించాయని ఈ కమిటీ ఆరోపించింది. వరుస క్షిపణి దాడులతో అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా… ఇటీవల హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించటం సంచలనం సృష్టించింది. ఉత్తర కొరియా చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా భద్రతామండలి ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించేలా పావులు కదిపింది. అమెరికా ప్రవేశపెట్టిన కఠిన ఆంక్షల తీర్మానాన్ని 15 మంది సభ్యులు గల భద్రతామండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉత్తరకొరియా ఇంధన దిగుమతుల్లో కోత పెట్టడంతో పాటు ఆ దేశ వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఐరాస నిర్ణయం తీసుకుంది. భద్రతామండలి తీర్మానం ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
అటు ఉత్తరకొరియా ఇటీవల పరీక్షించిన హైడ్రోజన్ బాంబు విస్ఫోటన సామర్థ్యం తాము అంచనావేసిన దానికంటే చాలా ఎక్కువని అమెరికా పర్యవేక్షణ బృందం తెలిపింది. ఈ బాంబు సామర్థ్యం 250 కిలో టన్నులని, 1945లో అమెరికా జపాన్ పై ప్రయోగించిన అణుబాంబు కంటే ఇది 16 రెట్లు అధికమని వివరించింది. అమెరికా అణుబాంబు 15 కిలో టన్నులని తెలిపింది. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు సామర్థ్యాన్ని దక్షిణ కొరియా, జపాన్ 160 కిలో టన్నులుగా అంచనావేశాయి. అయితే అది తప్పని అమెరికా పర్యవేక్షణ బృందం తెలిపింది. మరోవైపు అణుబాంబులతో జపాన్ ను ముంచివేస్తామన్న ఉత్తరకొరియా వ్యాఖ్యలపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తరకొరియా రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తోందని, ఇలానే ఉంటే ఆ దేశం ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోతుందని జపాన్ హెచ్చరించింది.