లాక్ డౌన్ తో రోడ్డు కాదని… నిదిలో ఈదలేక… అలసి మృత్యువాత

లాక్ డౌన్ కర్నాటకలో ఓ ఆర్టీసీ కండెక్టర్ ప్రాణాలు తీసింది. కరోనా మహమ్మారిని జయించేందుకు దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించ‌డం మంచిదే అయినప్పటికీ.. కొంద‌రిని మాత్రం ఈ లాక్‌డౌన్ తీవ్ర‌ మాన‌సిక వేద‌న‌కు గురిచేస్తుంది.  ఆ వేద‌న‌ను భ‌రించ‌లేక కొంద‌రు ప్రాణలు సైతం విడుస్తున్నారు.

తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రం విజ‌య‌పురా జిల్లాలో ఇలాంటి విషాద‌క‌ర ఘ‌ట‌నే చోటుచేసుకుంది. విజ‌య‌పురా జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మ‌నాగి మ‌ల్ల‌ప్ప క‌ర్ణాట‌క ఆర్టీసీలో కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అత‌ని భార్య కొన్ని నెల‌ల క్రితం ప్ర‌స‌వం కోసం త‌ల్లింటికి వెళ్లింది. రెండు నెల‌ల క్రితం ఆమెకు ఒక పాప పుట్టింది. అయితే లాక్‌డౌన్ తో ఇంట్లో ఒంట‌రిగా ఉంటున్న మ‌ల్ల‌ప్ప‌.. భార్య‌, బిడ్డ‌ను తీసుకొచ్చుకుంటే సంతోషంగా గ‌డుప‌వ‌చ్చ‌ని భావించాడు. దాంతో వెంటనే ఓ ట్ర‌క్కులో అత్తారింటికి చేరుకుని.. భార్యా, బిడ్డ‌తో క‌లిసి ఒక లారీలో తిరుగు ప‌య‌న‌ అయ్యాడు. అయితే విజ‌య‌పురాకు కిలోమీట‌ర్ దూరంలో పోలీసులు లారీని ఆపేశారు. అందులో నుంచి మ‌ల్ల‌ప్ప అత‌ని భార్య‌, బిడ్డ‌ల‌ను దించేశారు. దీంతో న‌ది అవ‌త‌ల కేవ‌లం కిలోమీట‌ర్ దూరంలో ఉన్న త‌మ గ్రామానికి వంతెన‌పైన న‌డుచుకుంటూ వెళ్తామ‌ని మ‌ల్ల‌ప్ప పోలీసుల‌ను బ‌తిమిలాడాడు. ఎంతో బ్రతిమిలాడటంతో… బాలింత బిడ్డను ఎత్తుకొని వంతెన‌పై న‌డుచుకుంటూ వెళ్లేందుకు పోలీసులు అనుమ‌తించారు. కానీ… మ‌ల్ల‌ప్ప‌ను మాత్రం అక్క‌డే నిలిపేశారు.

కండ‌క్ట‌ర్‌ మ‌ల్ల‌ప్ప పోలీసులను ఇంక బ్రతిమిలాడలేక న‌దిలో ఈదుకుంటూ త‌న గ్రామానికి చేరుకోవాల‌ని భావించాడు. వెంటనే న‌దిలో దిగి ఈద‌డం ప్రారంభించాడు. కానీ.. ఆ నదీ ప్ర‌వాహంలో ఎక్కువసేపు ఈద‌లేక అల‌సిపోయాడు. న‌దిలో మునిగి ప్రాణాలు విడిచాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు గ‌జ ఈత‌గాళ్ల సాయంతో గాలింపులు చేప‌ట్టి….  అమ‌ర్‌గ‌ల్ ప్రాంతంలో మ‌ల్ల‌ప్ప మృత‌దేహాన్ని గుర్తించారు. కాగా.. కేవలం పోలీసుల కారణంగానే.. త‌న త‌మ్ముడు మ‌ర‌ణించాడ‌ని మ‌ల్ల‌ప్ప సోద‌రుడు ప‌రుశ‌ప్ప ఆరోపిస్తున్నారు. ప‌రుశ‌ప్ప ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.