రైళ్లు పరిగెత్తే అవకాశం… కానీ… అంది ఉంటేనే..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని అన్ని రంగాలు 21రోజుల పాటు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అందుకు అన్ని వ్యవస్థలు కూడా చక్కా పాటిస్తున్నాయి. అయితే కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈనెల 14తో ముగియనుంది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా.? లేదా పొడిగిస్తారా.? అన్న అంశాలు పక్కన పెడితే.. రైళ్ల పునరుద్ధరణపై రైల్వేబోర్డు సమాయత్తమౌతుంది.అయితే తాజాగా రైళ్లను నడపాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నివారణ చర్యలు చేపడుతూనే ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రణాళికలను రెడీ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే అన్ని రైళ్లను కాకుండా కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వీటిల్లో ప్రయాణించే ప్రయాణీకులకు నిబంధనలను కూడా విధించనున్నారు .ట్రైన్‌లో స్లీపర్ కోచ్‌లు తప్పితే ఏసీ బోగీలు ఉండవు. గతంలో మాదిరిగా అన్ని స్టేషన్లలో ఆపకుండా.. నాన్ స్టాప్ పద్దతిలో రైళ్లను నడిపే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణానికి 12గంటల ముందే ప్రయాణీకుడు తన ఆరోగ్య సమాచారాన్ని రైల్వే అధికారులకు అందజేయాలి. బెర్త్ ఖరారైన వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతి.. ఇవ్వనున్నారు. అలాగే.. క్యాబిన్‌లో ఇద్దరికీ మాత్రమే బెర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులు నాలుగు గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాలి.

రైళ్లలో క్యాటరింగ్ సర్వీసులు అస్సలు నిలిపివేయనున్నారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే కోచ్‌లలోకి అనుమతించనున్నారు. గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు. ఇలా లాక్ డౌన్ తర్వాత రైలు ప్రయాణంలో పలు నిబంధనలను పెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రధాని మోడీ రేపు అనగా 11వ తేదీ నాడు ఆయా రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రైల్వే వర్గాల నుంచి సమాచారం అందుతుంది.