నోటా సినిమా రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

nota-review

నటీనటులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు
దర్శకుడు: ఆనంద్ శంక‌ర్
సంగీతం: స‌్యామ్ సిఎస్
నిర్మాత: కేఈ జ్ఞాన‌వేల్ రాజా
సినిమాటోగ్రఫీ: శాంత‌న కృష్ణ‌ణ్

nota-movie-poster-vijay“నోటా” అనే టైటిల్ తో సినిమా వస్తోంది అనగానే అది ఫక్తు రాజకీయ చిత్రం అని తేలిగ్గా అర్ధం అవుతుంది. పైగా ఎన్నికల ఏడాది కావడంతో అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఇక తెలుగులో వరస విజయాలు సాధిస్తూ కుర్రకారుని విశేషంగా ఆకర్షిస్తున్న విజయ్ దేవరకొండ హీరో కావడం కూడా నోటా మీద ఇంకా ఆసక్తి పెరగడానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో విడుదల అయిన నోటా ఎలా వుందో చూద్దామా !

కథ…

nota-pics-new

వాసుదేవ్ ( నాజర్ )రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితే ఓ అవినీతి కేసులో తీర్పు నేపథ్యంలో తాను కుర్చీ దిగుతూ తాత్కాలికంగా అప్పుడే లండన్ నుంచి వచ్చిన కొడుకు వరుణ్ ( విజయ్ దేవరకొండ ) ని సీఎం పీఠం మీద కూర్చోబెడతాడు. వాసు దేవ్ ఊహించని రీతిలో అతనికి కోర్టు శిక్ష విధిస్తుంది. అయితే ఆ తీర్పు మీద స్టే తెచ్చుకుని జైలు నుంచి తిరిగి వస్తుండగా అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో తాను సరదాగా కూర్చున్న సీఎం కుర్చీని సమర్ధంగా వాడాల్సిన అవసరం వరుణ్ కి తెలిసి వస్తుంది. ఆ ప్రయత్నంలో తండ్రీకొడుకులు ఒకరికి ఒకరు శత్రువుగా మారతారు. ఆలా ఎందుకు జరిగింది? చివరకు ఏమి అయ్యింది అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ …

Nota Movie Preview

రాజకీయ నేపధ్యం లో యువత మనోభావాలకు పెద్ద పీట వేస్తూ గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. యువత రాజకీయాల్ని మార్చగలదు అన్న నమ్మకం మీద ఆధారపడి తీసిన ఇంకో సినిమా నోటా. దర్శకుడు ఆనంద్ శంకర్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కధలో , కధనంలో ఆ స్థాయి పొటెన్షియల్ లేకుండా పోయింది. తొలి అర్ధ గంట సినిమా చూస్తున్నప్పుడు మంచి పొలిటికల్ డ్రామా చూడబోతున్నాం అన్న నమ్మకం కలిగింది. అయితే కథ , కధనం ముందుకు వెళ్లే కొద్దీ ఆ నమ్మకం సడలిపోయింది. ఇక కధలో ఏ ఒక్క క్యారెక్టర్ కి కూడా గట్టి సంకల్పం , గమ్యం ఉన్నట్టు అనిపించదు. ఇందుకు హీరో క్యారెక్టర్ కూడా అతీతం కాదు. ఇక కధకి కేంద్ర బిందువు లాంటి కధానాయకుడు ఏ దశలోనూ పూర్తి స్థాయి హీరో గా వ్యవహరించడు. ఒక్కో సారి సాధారణ రాజకీయ నేతగా , ఇంకో సారి యువ భావాలకు ప్రతినిధిగా, మరో సారి ఇంకో రకంగా అనిపిస్తాడు. సినిమా తొలి అర్ధ గంట తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కథ ముందుకు సాగదు. ఇక పొలిటికల్ డ్రామాకి ఫ్లాష్ బ్యాక్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అనుకుంటే అంత సాదాసీదాగా నడుస్తుంది వ్యవహారం.

High Court Petition On Nota Movie

దర్శకుడు ఆనంద్ శంకర్ కొన్ని సీన్స్ రాసుకుని దాని చుట్టూ కథ అల్లుకున్నట్టు అనిపిస్తుంది. దీంతో కధలో ఆత్మ లోపించింది. కథ లేదా ఏ పాత్రతో కూడా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో మమేకం కాలేని పరిస్థితి. ఇక సినిమాకి నేపధ్యం అయిన రాజకీయాన్ని కూడా మరీ తమాషా చేయడంతో ఎక్కడా సీరియస్ నెస్ కనిపించదు. ప్రధాన పాత్రలు తప్ప మిగిలిన పాత్రలకు బుర్ర ,మవ్యక్తిత్వం లేకుండా చూపించడంతో కథ మీద పట్టు లేకుండా పోయింది. హీరో , విలన్ , మిగిలిన ప్రధాన పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ లేకుండా పోవడంతో సెకండ్ హాఫ్ లో అసలు ఆసక్తి అన్నది లేకుండా పోయింది.

nota-vijayadevarakonda
హీరో విజయ్ దేవరకొండ కి తమిళ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫలితం వస్తుందో గానీ తెలుగులో నోటా పెద్దగా మంచి రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ లేదు. అయితే పాత్ర పోషణలో విజయ్ తన స్థాయికి తగినట్టు బాగా చేసాడు. నాజర్ , సత్య రాజ్ తప్ప ఇక మిగిలిన పాత్రలకి పెద్దగా అవకాశం లేదు. ఆ ఇద్దరు సీనియర్ నటులు బాగా చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నటీనటులతో పాటు మిగిలిన సాంకేతిక బృందం పనితీరు బాగానే ఉన్నప్పటికీ కథ , కధనం , దర్శకత్వం గాడి తప్పడంతో ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ కాలేకపోయాడు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : నోటా పేరులో వున్న దమ్ము సినిమాలో లేదు .
తెలుగు బులెట్ రేటింగ్ : 2 .25 /5 .