తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర చిత్రం ‘ఎన్టీఆర్’ రెగ్యులర్ షూటింగ్‌కు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. జులై 5 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ అప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు చూసుకుంటూనే మరో వైపు ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించేందుకు క్రిష్ సిద్దం అయ్యాడు. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపనున్నారు. అదే షెడ్యూల్లో రామకృష్ణ సినీ స్టూడియోలో కూడా పలు సీన్స్‌ను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీపై కూడా తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను జనవరి 9న విడుదల చేయబోతున్నారు. బాలకృష్ణ ఇప్పటికే పలు సందర్బాల్లో మాట్లాడుతూ సంక్రాంతికి నాన్నగారి బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక జనవరి 9నే ఎందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు అనే విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించి రికార్డు స్థాయిలో పార్టీ పెట్టిన తక్కువ సమయంలోనే అధికారంను దక్కించుకున్న ఎన్టీఆర్ సీఎంగా మొదటిసారి జనవరి 9న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్టీఆర్ మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసిన తేదీన సినిమాను విడుదల చేయడం శుభ సూచకం అంటూ బాలయ్య భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఎన్టీఆర్ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. విద్యాబాలన్‌ను ఈ చిత్రంలో బసవతారకం పాత్రకు గాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. రానాను చంద్రబాబు నాయుడు పాత్రకు సంప్రదించారట. కొత్త వారు పలువురు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.