నందమూరి బాలకృష్ణ తన తండ్రి మహానటుడు నందమూరి తారక రామారావు పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న బయోపిక్ చిత్రం “కథానాయకుడు, మహానాయకుడు” అనే భాగాలుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ కథానాయకుడు అనే మొదటి భాగం జనవరి 9 న, మహానాయకుడు అనే రెండవ భాగం జనవరి 24 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది. కానీ, ఇలా వెంట వెంటనే రెండు భాగాలను విడుదల చేయడం వలన సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించొచ్చు అని నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో, చిత్ర యూనిట్ రెండవ భాగం అయిన మహానాయకుడు విడుదల తేదీ విషయంలో మరోసారి ఆలోచనలో పడినట్టు సమాచారం.
తేజ మొదలుపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం, తేజ వైదొలగడంతో బాలకృష్ణ నే స్వయంగా దర్శకత్వం వహిస్తారనే టాక్ కూడా వినిపించింది. కానీ, ఈ సినిమాకి దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి చేరడంతో ఈ సినిమాపై అప్పటివరకు నెలకొన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాకుండా, ఈ సినిమా లోని ప్రతి పాత్ర యొక్క ఫస్ట్ లుక్ పిక్చర్స్ ని ఒక స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్న తీరు, క్రిష్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తునట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.