‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘నోటా’. భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలోగందరగోళం ఏర్పడినది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ దేవరకొండ అభిమానులు ఎదురు చూస్తుండగా, నిర్మాత మాత్రం మంచి సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ చిత్రంకు అక్టోబర్ 4, అక్టోబర్ 10, అక్టోబర్ 18 మూడు తేదీలను పరిశీలిస్తున్నారు. ఈమూడు తేదీల్లో ఏ తేదీన వచ్చినా కూడా సినిమాకు నష్టం తప్పదు అనే టాక్ వినిపిస్తుంది.
అక్టోబర్ 4న వస్తే ఎన్టీఆర్ చిత్రం జోరు ముందు ఈ చిత్రం నిలవలేక వారం రోజుల్లోనే అంతా సర్దేసుకోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంను దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ఒక్క రోజు ముందు అంటే అక్టోబర్ 10న నోటా చిత్రాన్ని విడుదల చేస్తే కష్టం తప్పదు. అదే తేదీకి తీసుకు వస్తే నందమూరి ఫ్యాన్స్ విజయ్‌ను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం ఖాయం. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాను ఢీ కొట్టగల సత్తా నీకు ఉందా అంటూ విజయ్ దేవరకొండను సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అక్టోబర్ మొత్తం వదిలేయమని, నవంబర్‌లో సినిమా విడుదల పెట్టుకోమంటూ విజయ్‌కి సన్నిహితులు సలహా ఇస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల అయినా కూడా పెద్ద చిత్రాల నుండి పోటీ తప్పదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.