Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీల కాంబినేషన్లో వచ్చిన ‘జైలకువశ’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది. ఎన్టీఆర్ కెరీర్లో ది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్లో ‘జనతాగ్యారేజ్’ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించి ఉంది. తాజాగా ఆ రికార్డును ఎన్టీఆర్ ఈ చిత్రంతో బ్రేక్ చేశాడు. ఇక టాలీవుడ్లో ఇప్పట్లో ఏ సినిమా కూడా బాహుబలి రికార్డులను బ్రేక్ చేయలేదు. రెండు పార్ట్లు కూడా భారీ వసూళ్లను సాధించాయి. అందుకే నాన్ బాహుబలి రికార్డులు అంటూ టాలీవుడ్లో కొత్తగా వచ్చాయి.
బాహుబలి తర్వాత స్థానంలో చేరితే వాటిని నాన్ బాహుబలి రికార్డులుగా పేర్కొంటున్నారు. నాన్ బాహుబలి రికార్డుల్లో నెం.1 స్థానంలో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’ ఉండగా, నెం.2 స్థానంలో శ్రీమంతుడు ఉంది. చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం 164 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఆ సినిమా తర్వాత శ్రీమంతుడు చిత్రం 156 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను వసూళ్లు చేసింది. ప్రస్తుతం ‘జైలవకుశ’ చిత్రం 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వద్ద ఉంది. త్వరలోనే మరో పది కోట్లను సునాయాసంగా ఈ చిత్రం వసూళ్లు చేసి తీరుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
లాంగ్ రన్లో జైలవకుశ చిత్రం దాదాపు 160 కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. అంటే ఖైదీ నెం.150కి చాలా దగ్గరగా అన్నమాట. స్వల్ప తేడాతో నాన్ బాహుబలి రికార్డును దక్కించుకునే అవకాశం ఎన్టీఆర్ మిస్ అవుతున్నాడు. ఈ వారంలో విడుదల కాబోతున్న నాగార్జున ‘రాజుగారి గది 2’ చిత్రం ఫలితం తేడా కొడితే ఎన్టీఆర్ మరో వారం రోజులు సందడి చేసి చిరు రికార్డును బద్దలు కొడతాడేమో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం జైలవకుశ నాన్బాహుబలి రికార్డును సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.