Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ కార్యక్రమంతో ఏదైనా ఓ రూపంలో అనుబంధం ఉంటే…ఆ కార్యక్రమం ముగిసేటప్పుడు మనకు ఎక్కడాలేని బాధ కలుగుతోంది. ఓ రకమైన భావోద్వేగంలో మునిగిపోతాం. ఇక ఆ కార్యక్రమాన్ని ఓన్ చేసుకుని…ముందుండి నడిపించే వారికి ఇంకెంత బాధ ఉంటుంది. తాము కొంతకాలం యాంకరింగ్ చేసిన కార్యక్రమం ముగుస్తోంటే…కంటెస్టెంట్స్ తో పాటు…ఆ యాంకర్ కూడా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టే ఘటనలు అప్పుడప్పుడూ టీవీలో చూస్తుంటాం. యాంకర్ కు ఆ ప్రోగ్రామ్ తో విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే ఆ కార్యక్రమం ముగిసేటప్పుడు వారు బాధను వ్యక్తంచేస్తుంటారు. బిగ్ బాస్ సీజన్ 1 ముగింపు సమయంలో ఇలాంటి భావోద్వేగ వాతావరణమే కనపడింది. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో ఎనౌన్స్ చేయగానే…ఆ ప్రోగ్రామ్ కు విపరీతమైన హైప్ వచ్చింది. యంగ్ టైగర్ బుల్లితెరమీద కనిపిస్తుండటమే ఆ హైప్ కు కారణం. అందుకు తగ్గట్టుగా…తన మాటల మాయాజాలంతో తారక్ బిగ్ బాస్ సీజన్ 1ను రక్తికట్టించాడు. ఒకానొక దశలో ఎన్టీఆర్ వల్లే ఆ షో నడుస్తోంది అన్న అభిప్రాయాలు సైతం వినిపించాయి. అంతగా తారక్ ఆ షోను ఓన్ చేసుకున్నారు.
70 రోజుల పాటు సాగిన ముగుస్తున్న సమయంలో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బిగ్ బాస్ విజేతను ప్రకటించేముందు టాప్ 2 పోటీదారులైన శివబాలాజీ, ఆదర్శ్ అనుభవాలతో ఓ ఏవీని ప్రదర్శించారు. అనంతరం తారక్ కు సంబంధించిన ఏవీని ప్రదర్శించారు. ఎన్టీఆర్ వ్యాఖ్యానం, పార్టిసిపెంట్స్ ను ఆటపట్టించిన విధానం, వారితో ఉన్న అనుబంధం, హౌస్ లో తారక్ బిర్యానీ చేయడం వంటి పలు సన్నివేశాలతో ఉన్న ఈ ఏవీ అందరికీ ఎంతగానో నచ్చగా…ఎన్టీఆర్ ను మాత్రం భావోద్వేగంలో పడేసింది. ఈ ఏవీ ఇంకాసేపు కొనసాగితే ఏడ్చేసేవాడినన్నారు జూనియర్. ఈ సందర్భంగా బిగ్ బాస్ ను వేదికమీదకు ఆహ్వానించారు ఎన్టీఆర్. బిగ్ బాస్ కళ్లు, గొంతు తానైతే, రూపం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సమాధానమిచ్చాడు బిగ్ బాస్. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించిన తారక్ కంటెస్టెంట్స్ తో తనది మరపురాని అనుబంధమని, వారు ఏ క్షణంలో వచ్చి అయినా తనను కలవవచ్చని, అందరమూ బయట కలుద్దామని చెప్పారు. మొత్తానికి ఏదో ప్రోగ్రామ్ చేశామా వెళ్లామా అన్నట్టు కాకుండా..షో తో పాటు….హౌజ్ మేట్స్ తోనూ అనుబంధం పెంచుకున్న ఎన్టీఆర్ …. బిగ్ బాస్ సీజన్ 1 తో యాంకర్ గా వందశాతం సక్సెస్ అయ్యారనే పేరు తెచ్చుకున్నారు.