తాడిపత్రి, చర్చి ఫాదర్ నగ్నంగా పడుకుని బాడీ మసాజ్ చేయాలని బాలికలను బెదిరించిన ఘటన ఏడాది గడుస్తున్నా తేలడం లేదు. ఆయన్ను అరెస్ట్ చేయాలని స్వయానా రాష్ట్ర హోం మంత్రి ఆదేశించినా అరెస్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పటికీ ఆ చర్చి సభ్యులు, పదుల సంఖ్యలో మహిళలు అడ్డుకోవడంతో వారు వెనక్కి మళ్లాల్సి వచ్చింది. తాడిపత్రిలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే తాడిపత్రికి చెందిన ఓ బాలిక చర్చి స్కూళ్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబర్‌లో ఆమెతోపాటు మరి కొంత మంది బాలికలను తన ఇంటికి పిలిచిన చర్చి పాస్టర్ ఎమిలిరాజ్ నగ్నంగా పడుకొని బాడీ మసాజ్ చేయాలని బెదిరించారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో కేసు ముందుకు వెళ్లలేదు. పోలీసులు రాజీకి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడంతో.. ఆరు నెలల తర్వాత తాడిపత్రి పోలీసులు చర్చి పాస్టర్‌పై కేసు నమోదు చేశారు. కానీ ఆయన్ను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం మంత్రుల ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో కనిపించడంతో హోం మంత్రి సుచరితకు ఫోన్ చేసిన బాధితురాలి తల్లి.. తన గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే పాస్టర్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఎమిలిరాజ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లగా చర్చి కమిటీ సభ్యులు, మహిళలు అడ్డుపడ్డారు. కాగా చర్చి పాస్టర్ పరారీలో ఉన్నారని సమాచారం.