కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు అనుమతి మేరకు ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్‌లైన్‌లో రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లోనూ రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల అనుమతికి సంబంధించి ఈ నెల 17న జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల జారీకి సంబంధించి వెబ్ పోర్టల్ సిద్ధమైందన్నారు. టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించిన దాతలకు ప్రివిలేజ్ కింద శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 నుంచి భక్తులు టీటీడీ వెబ్‌సైట్ నుంచి శ్రీవారి ఉదయాస్తమాన సేవాటికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్వీబీసీలో ప్రచారం చేస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.