మంచానికి మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి దుర్గారావు కూలి పనులు చేసుకుంటూ తల్లి రెడ్డి సీతమ్మతో కలసి జామి అప్పన్నవీధి, సత్యనారాయణపురం సీతన్నపేటగేటు సమీపంలో నివాసముంటున్నాడు. తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. రోజు తల్లికి టిఫిన్ తినిపించి సపర్యలు చేసి, ఆమెకు చుట్ట తాగే అలవాటు ఉండటంతో కొన్ని చుట్టలు మంచం పక్కనే పెట్టి పనికి వెళ్తుంటాడు.
సోమవారం ఉదయం తల్లికి టిఫిన్ తినిపించి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి పొగ వస్తుండటంతో చుట్టుపక్కల వారు దుర్గారావుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా తల్లి పడుకున్న మంచానికి మంటలు వ్యాపించాయి. నీళ్లు చల్లి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే మంటల్లో పూర్తిగా కాలిపోయి సీతమ్మ చనిపోయింది. చుట్ట తాగి కింద పడేయడంతో మంచం కింద ఉన్న బట్టలకు మంటలు వ్యాపించి నవ్వారు మంచం కాలిపోయిందని, కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు మంటల్లో కాలిపోయి మృతి చెంది ఉండొచ్చని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.