దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 2, కర్ణాటకలో 5, కేరళలో 4 ఒమిక్రాన్ కేసులు సోమవారం బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167 కేసులకు చేరింది. అయితే, 24 కొత్త వేరియంట్ బాధితుల్లో 12 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఢిల్లీ ఆరోగ్య విభాగం తెలిపింది. ఉడిపిలో రెండు, ధార్వాడ్, భద్రావతి, మంగళూరులో ఒక్కోటి చొప్పున ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ చెప్పారు. బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించారు.
ఇక కరోనా వ్యాప్తి విషయానికి వస్తే గత 24 గంటల్లో భారత్లో 6563 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. వ్యాధిగ్రస్తుల్లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 8,077 బాధితులు కోలుకోగా.. మొత్తంగా 3,41,87,017 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యశాఖ బులెటిన్లో పేర్కొంది. భారత్లో 82,267 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 572 రోజుల్లో ఇదే అల్పం. దేశంలో ఇప్పటివరకు 137.67 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.