ఏపీలో బీజేపీ పరిస్థితి అస్సలు బాలేదు. అసలే ఏపీలో పార్టీ అంతంతమాత్రం అంటే ఇప్పుడున్న కొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేన బాట పట్టగా ఇప్పుడు ఆయన బాటలోనే మరికొందరు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో విష్ణుకుమార్‌రాజు, పురంధేశ్వరి వంటి కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది మాత్రం కోడ్ వచ్చాక చెబుతానని విష్ణుకుమార్ రాజు ప్రకటించారు.
ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని అన్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడారని తెలిపారు. దీంతో ఆయన కూడా బీజేపీని వీడటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా సీనియర్ మహిళా నాయకురాలు పురంధేశ్వరి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే, తనకు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 21న అమీ ఫ్యాన్ పంచన చేరుతున్నారని అంటున్నారు. అదే జరిగితే ఏపీ బీజేపీకి గడ్డు కాలం వచ్చినట్టే.