ఆన్ లైన్ లిక్కర్ ఫర్ సేల్: మరో రూ.50 వేలకు మోసం

wines

కరోనా మహమ్మారి విశ్వాన్ని వణికిస్తోంది. ఇదే సమయంలో దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌ ప్రభావం మందుబాబులపై చాలా తీవ్రంగా పడింది. డైరెక్ట్ గా కొనేందుకు వైన్ షాపులు మూసేయడంతో మందుబాబులు ఏకంగా ఆన్ లైన్ లో కొనేందుకు ఆర్డర్ పెడుతున్నారు. దీంతో చివరకి మోసానికి గురౌతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అలాగే నగరంలో మద్యం కోసం ఆన్ లైన్ సెర్చ్‌ చేసిన ఒకరు ఇలాగే మోసానికి గురయ్యాడు. సైబర్‌ నేరగాళ్ళకు చిక్కుకున్నాడు. నగరానికి చెందిన ప్రముఖ వైన్‌ షాప్‌ బగ్గా వైన్‌ షాప్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజ్‌ ఓపెన్‌ చేశారు. దీని ద్వారా ఆర్డర్‌ ఇస్తే కావాల్సిన బాటిల్స్‌ ను డోర్‌ డెలివరీ చేస్తామంటూ నమ్మించి భారీగా దండుకుంటున్నారు. ఈ సైబర్‌ నేరగాళ్ళ వలలో పడి రూ.50 వేలు కోల్పోయిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు ప్రారంభించారు.

కాగా బాధితుడు చెప్పినట్లుగానే దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది రాజస్థాన్‌ గ్యాంగ్స్‌ పనిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో తమ సంస్థ పేరుతో ఏర్పాటైన నకిలీ పేజీలపై బగ్గా వైన్స్‌ సంస్థ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా స్పందించిన అధికారులు వాటిని తొలగించాలని కోరుతూ ఫేస్‌బుక్‌ సంస్థకు నోటీసు జారీ చేసి తీవ్ర గాలింపు చేపట్టింది.