ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్. ప్రతీరోజూ కోట్లాది మంది యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. వినోదం, టైమ్‌పాస్‌కు కేరాఫ్ ఆడ్రస్‌లా మారిపోయింది ఈ ప్లాట్‌ఫామ్. సినిమా ట్రైలర్లు, పాటల దగ్గరి నుంచి వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌ల వరకు యూట్యూబ్‌లో లక్షలాది వీడియో కంటెంట్ ఉంటుంది. అయితే ఇటీవల గూగుల్ పరిధిలోని యూట్యూబ్ ఓ మార్పు తీసుకొచ్చింది.
వీడియోలను డౌన్‌లోడ్ చేసుకొని.. వీలున్నప్పుడు చూసేలా ఆఫ్‌లైన్ సదుపాయం యూట్యూబ్‌లో ఉంది. ఇంటర్నెట్ అంటుబాటులో ఉన్నప్పుడు ఇష్టమైన వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని.. డేటా ఆన్ చేయకుండానే ఆ తర్వాత అది చూడవచ్చన్న మాట. ఈ సర్వీస్ కూడా యూట్యూబ్ వాడుతున్న దాదాపు అందరికీ తెలుసు. ఈ ఆఫ్‌లైన్ వీడియోల విధానంలోనే యూట్యూబ్ ఓ ఛేంజ్ చేసింది.
యూట్యూబ్ వీడియోలను హై రెజల్యూషన్ నుంచి లో రెజల్యూషన్ వరకు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఫుల్ హెచ్‌డీ, హెచ్‌డీ , మీడియం , లో క్వాలిటీల్లో వీడియోలను ఆఫ్‌లైన్ చేసుకోవచ్చు. అయితే తాజాగా ఫుల్ హెచ్‌డీ, హెచ్‌డీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కేవలం ప్రీమియమ్ మెంబర్లకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది యూట్యూబ్. అంటే సాధారణ యూజర్లు మీడియం, లో క్వాలిటీలో మాత్రమే వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్న మాట. తొలుత 720 పిక్సెల్ రెజల్యూషన్ వీడియోలు అందరికీ అందుబాటులో ఉండగా.. ఇది కూడా ఇప్పుడు ప్రీమియమ్ సర్వీసుల్లో చేరిపోయింది.
సాధారణంగా యూట్యూబ్ ప్రీమియమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే యాడ్లు లేకుండా వీడియోలు చూడవచ్చు. అలాగే కొన్ని ప్రీమియమ్ కోసం ఉన్న కొన్ని ప్రత్యేక వీడియోలు వీక్షించవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆడియో ఓన్లీ ఫీచర్లు వస్తాయి. అయితే తాజాగా ఫుల్‌హెచ్‌డీ, హెచ్‌డీ క్వాలిటీలో వీడియోల డౌన్‌లోడ్ సదుపాయాన్ని కూడా ప్రీమియమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికే పరిమితం చేసింది యూట్యూబ్. అంటే ప్రీమియమ్ తీసుకొని యూజర్లు 360 పిక్సెల్, 144 పిక్సెల్ లాంటి లో క్వాలిటీలోనే వీడియోను డౌన్‌లోడ్ చేసుకోగలరు.