Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరి, కొండా మురళి.. ముగ్గురూ బలమైన నేతలే. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఇమడలేకపోతున్నారనేది బహిరంగ రహస్యం. వరంగల్ లో టీఆర్ఎస్ కు మంచి ఊపు ఉన్నా.. నాయకుల మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయి. వీరి ముగ్గుర్నీ కలిసి పనిచేయించాలంటే హరీష్, కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు తరచుగా జోక్యం చేసుకోవాల్సి వస్తోంది.
ఎర్రబెల్లి, కడియం గతంలో టీడీపీలో ఉండేవారు. వీరిద్దరీ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి ఉంది. కడియం వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదని ఎర్రబెల్లి చాలాసార్లు వాపోయారు. ఇప్పుడు పార్టీ మారి కారెక్కినా ఆయనకు సేమ్ సీన్ ఎదురైంది. ఇక్కడ కడియం డిప్యూటీ సీఎంగా ఉంటే.. ఎర్రబెల్లి కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూసి అలసిపోయారాయన.
కొండా మురళి కథే వేరు. కాంగ్రెస్ లో ఉండగా చక్రం తిప్పిన ఈయన గులాబీ పార్టీలో చేరి సైలంటైపోయారు. తనకు కేసీఆర్ అనుకున్నంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది ఆయన ఆరోపణ. కేసీఆర్ వాడుకుని వదిలేసే రకంలా ఉన్నారని కూడా ఆయనకు బలమైన అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి ఎందుకు కృషి చేయాలనేది ఆయన ప్రశ్న. వీరు ముగ్గురూ ఇలాగే ఉంటే.. ఈ విభేదాలే పార్టీ కొంప ముంచుతాయని క్యాడర్ ఆందోళన చెందుతోంది.