పెద్దల సభ చేతిలో ఓసీ రిజర్వేషన్ బిల్లు…!

Owaisi Opposes Reservation Bill Says It's A Fraud On Constitution

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన బిల్లు నిన్న లోక్ సభలో ఆమోదం పొందింది. తాజాగా ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్రమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్ట్టారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లును తెస్తున్నామని, ఈ బిల్లు ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, సామాజిక సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా ఈ బిల్లుపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని, కొన్ని సవరణలు చేయాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమావేశాలను పొడిగించడంపై రాజ్యసభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

శీతకాల సమావేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడగిస్తారంటూ సభలో ఆందోళనలు చేపట్టారు. పొడిగింపుపై ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. రాజ్యసభలో ఇప్పటివరకూ రఫేల్‌ సహా తాము డిమాండ్‌ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని విమర్శించారు. అయితే, బీఏసీ సమావేశంలోనే రాజ్యసభ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి చాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బిల్లు ఆమోదం పొందింది. కానీ రాజ్యసభలో మాత్రం తిరస్కరణను ఎదుర్కొంటుంది.