కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని మోడీ ఏమాత్రం ప్లానింగ్ లేకుండా లాక్డౌన్ విధించారని అన్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. లాక్డౌన్ ప్రకటించేటప్పుడు వలస కార్మికుల పరిస్థితిని పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారని.. అన్నారు. అర్బన్ సిటీల్లో పనిచేస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖాండ్ వలస కూలీల గురించి ప్రధాని ఏమాత్రం ఆలోచించలేదని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ బయలేదేరిన 12 ఏళ్ల అమ్మాయి 100 కిలోమీటర్లకు పైగా నడిచి.. పూర్తి అలసటతో కన్నుమూయడమే అందుకు నిదర్శనమని ఒవైసీ తెలిపారు.
అదేవిధంగా వలస కార్మికుల ఇక్కట్లు ఇన్నీ అన్నీ కావుని.. లాక్డౌన్ భయంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. ఇళ్లకు కూడా చేరలేని దయనీయ పరిస్థితిలో ఉన్నారని ఆయన చెప్పారు. వలస కార్మికుల్లో ఎక్కువ మందికి బ్యాంకు అకౌంట్ కానీ, రేషన్ కార్డు కానీ లేవని, అలాంటి వారికి ‘ఆధార్’ కార్డు నంబర్‌ను బట్టి డబ్బు సాయం చేయాలని వివరించారు. గోదాముల్లో నిల్వచేసిన బియ్యాన్ని అసరమైన ప్రజలకు పంచాలని కోరారు.
అంతేకాకుండా కేంద్రం ఆమోదించిన రూ.30,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేసి, ఆ మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకానికి పంచాలని కోరారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం ప్లాన్ ఏవిధంగా ఉండబోతోందని అడిగినప్పుడు.. వలస కార్మికుల పరిస్థితి ఏమిటి? వాళ్ల ఉద్యోగాలు మళ్లీ వాళ్లకు వస్తాయా? అని ఒవైసీ ప్రశ్నించారు. అలాగే… ఇస్లాంను పరిహసిస్తూ ఓ టీవీ యాంకర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఆయన తన పేరుతో పాటు తన గురించి మాట్లాడారని.. రువాండాలో నరమేధంపై.. అది ఎందుకు జరిగిందో ఆ యాంకర్ తెలుసుకుంటే మంచిదని స్పష్టం చేశారు. ఇంకా మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఈ మధ్య సాధువులను కొట్టిచంపిన ఘటనను తాను ఖండిస్తున్నట్టు ఒవైసీ వివరించారు. కాగా ఈ ఘటన వెనుక ముస్లింలు ఉన్నారని బీజేపీ సభ్యుడు అంతర్జాతీయ వేదికపై చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒవైసీ వివరించారు.