అద్దె కట్టాలంటూ యజమానుల వేధింపులు.. పోలీసుల రియాక్షన్ ఇలా..

కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. దీంతో పలువురు భవనంలో పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటున్నారు. మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. అక్కడే చిక్కుకుపోయిన వారిని మాత్రం భవన యజమానులు అద్దె కోసం ఇబ్బందులకు గురిచేయడంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా హాస్టల్స్‌లో చిక్కుకుపోయిన.. పేయింగ్ గెస్ట్‌‌ హౌస్‌లలో ఉంటున్న వారిని నిర్వాహకులు అద్దె కోసం డిమాండ్ చేయ వద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అది యజమానులు ఏమాత్రం చెవికెక్కించుకోవడం లేదు.

అద్దె చెల్లించాల్సిందేనంటూ పట్టుబడతుండడంతో పలువురు ఇబ్బందులకు గురవున్నారు. యజమానుల వేధింపులు భరించలేక కొందరు పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

తాజాగా బెంగుళూరు నగరంలోని మరతహళ్లి ప్రాంతంలోని ఓ భవనంలో యువకులు పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటున్నారు. లాక్‌డౌన్ ప్రకటించడంతో కొందరు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. సుమారు 90 శాతం మంది వెళ్లిపోగా.. కేవలం పది శాతం మంది మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. అయితే కరోనాతో ఉపాధి కరువై ఇబ్బందుల్లో ఉన్న హాస్టల్స్‌లో ఉంటున్న వారిని.. పేయింగ్ గెస్ట్‌లను అద్దె డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేయొద్దని బెంగళూరు పోలీస్ కమిషనర్ గతవారమే హెచ్చరించారు కూడా.

అయినప్పటికీ పలువురు భవనాల యజమానులు అద్దె డబ్బులు చెల్లించాల్సిందేనంటూ పేయింగ్ గెస్ట్‌లను డిమాండ్ చేయడంతో చేసేది లేక వారు మరతహళ్లి పోలీసులను ఆశ్రయించారు. కాగా విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు భవన యజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.