కేంద్రం మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. మరో వైపు పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే భావనలో కొందరు బంకు నిర్వాహకులు పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో.. నగరంలో పలు చోట్ల బంకుల యజమానులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. పెట్రోల్ బంకుల వద్ద రహదారిపైకి వాహనదారులు భారీగా చేరుకోవడంతో ఖైరతాబాద్-లక్డీకాపూల్, లక్డీకాపూల్-మెహదీపట్నం మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.