ఎట్టకేలకు సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ విడుదల తేదీ ఖరారయింది. సీబీఎఫ్ సీ యుఏ సర్టిఫికెట్ ఇచ్చిన పద్మావతి…పద్మావత్ గా పేరు మార్చుకుని ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. చిత్తోర్ రాణి పద్మిణి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన పద్మావత్ పై షూటింగ్ దశ నుంచే మొదలయిన వివాదం… చిత్రీకరణ పూర్తయ్యేసరికి తీవ్రరూపం దాల్చింది. రాజ్ పుత్ లు గర్వకారణంగా భావించే పద్మిణి జీవితకథలో సినిమాకోసం మార్పలు చేశారని, ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి, పద్మిణికి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ రాజ్ పుత్ కర్ణిసేన ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తంచేసింది.
చరిత్రను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధం కూడా విధించాయి. అదే సమయంలో సినిమా సెన్సార్ పూర్తికాకముందే మీడియాకు ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీబీఎఫ్ సీ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించడంతో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన పద్మావతి నిలిచిపోయింది. బీజేపీ నేత ఒకరు పద్మావతిగా నటించిన దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలకు వెలకట్టడం సంచలనం సృష్టించింది. సినిమా విడుదల వాయిదా పడడంతో ఆందోళనలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. అనంతరం పార్లమెంటరీ ప్యానల్ కమీటికి సంజయ్ లీలా భన్సాలీ వివరణ ఇవ్వడం, సెన్సార్ బోర్డు విధించిన షరతులకు ఆయన ఆమోదం తెలపడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమయింది. సీబీఎఫ్ సీ సూచించినట్టుగా పద్మావత్ గా పేరు మార్చి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్.