Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ పద్మావతిపై వివాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇప్పటిదాకా ఉత్తరభారతదేశానికే పరిమితమయిన ఆందోళనలు ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించాయి. పద్మావతి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ తమిళనాడులో నిరసనలకు దిగింది. ఒక వేళ సినిమా విడుదలయితే థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ కోవై జిల్లా అధ్యక్షుడు శివలింగం, రాష్ట్రీయ రాజపుత్ర కర్ణిసేన అఖిల భారత అధ్యక్షుడు సుబ్ దేవ్ గిల్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదలచేశారు. చిత్తోర్ రాణి పద్మిణి జీవితం ఆధారంగా తెరకెక్కిన పద్మావతిలో రాజ్ పుత్ మహారాణిల గౌరవాన్ని కించపరిచే దృశ్యాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలను అడ్డుకుని తీరుతామని రాజ్ పుత్ కర్ణిసేన హెచ్చరిస్తోంది.
నిర్మాణానికి ముందునుంచీ సినిమాను వ్యతిరేకిస్తున్న రాజ్ పుత్ కర్ణిసేన విడుదల తేదీ దగ్గరపడడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కర్ణిసేన పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమయితే ఓ అడుగు ముందుకేసి…పద్మావతికి సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ ఇచ్చేముందు ప్రజల ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. పద్మావతి విడుదల చేయాలని భావిస్తున్న డిసెంబరు 1న కర్ణిసేన బంద్ కు పిలుపునిచ్చింది. ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పద్మావతి హీరోయిన్ దీపికా పదుకునేను కర్ణిసేన టార్గెట్ చేసింది. మహిళలపై ఇప్పటివరకూ తాము చేయెత్తలేదని, కానీ ఈ పోరాటంలో భాగంగా అవసరమైతే దీపిక మీద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లక్ష్మణుడు శూర్పణఖకు చేసినట్టుగా దీపిక ముక్కు కోస్తామని తీవ్ర వ్యాఖ్యలుచేసింది. అంతటితో ఆగకుండా..ఆమె ప్రాణాలకు హాని తలపెడతామని కూడా హెచ్చరించింది. అయితే దీపిక మాత్రం ఈ హెచ్చరికలు పట్టించుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు భద్రతపెంచారు. అటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పద్మావతికి సర్టిఫికెట్ ఇవ్వకుండా వెనక్కిపంపండం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దరఖాస్తులోని కొన్ని ఖాళీలను నిర్మాతలు పూరించలేదని, దరఖాస్తును పూర్తిగా నింపి పంపిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తామని సీబీఎఫ్ సీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై చిత్రబృందం కూడా స్పందించింది. సినిమాకు ఇంకా సర్టిఫికెట్ ఇవ్వని మాట వాస్తవమే అని, కానీ సినిమాను వెనక్కి పంపలేదని, సీబీఎఫ్ సీ దగ్గరే ఉందని, ఇది కేవలం ఓ చిన్న సాంకేతిక లోపమని తెలిపింది. ఆందోళనలు, సర్టిఫికెట్ ఆలస్యం నేపథ్యంలో పద్మావతి విడుదల వాయిదా పడే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి