Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల నేపథ్యంలో భారత్ లో పద్మావతి విడుదల వాయిదా పడగా…బ్రిటన్ మాత్రం ఎలాంటి కట్స్ చెప్పకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముందుగా అనుకున్న తేదీ డిసెంబరు 1న బ్రిటన్ లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోనూ పద్మావతికి నిరసనగా ఆందోళనలు బయలుదేరాయి. లండన్ లోని రాజ్ పుట్ సమాజ్ పద్మావతికి నిరసనగా బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు నిర్వహించింది. పద్మావతికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసించిన రాజ్ పుత్ లు వెంటనే దాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత్ లో ఈ సినిమా వివాదం కొలిక్కి వచ్చే వరకు బ్రిటన్ లో సినిమాను విడుదలచేయబోమని నిర్మాతలు హామీ ఇచ్చారని రాజ్ పుత్ సమాజ్ హెడ్ హరేంద్ర సింగ్ జోధా చెప్పారు. పద్మావతికి 12ఎ రేటింగ్ ఇచ్చింది బ్రిటన్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ . అంటే 12 ఏళ్ల లోపు చిన్నారులు ఈ సినిమా చూసే అవకాశం లేదు. కాగా సర్టిఫికేషన్ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, నియమ నిబంధనల ప్రకారమే సర్టిఫికెట్ ఇచ్చామని బీబీఎఫ్ సీ పేర్కొంది. అటు పద్మావతి హీరోయిన్ దీపిక పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలకు రాజ్ పుత్ కర్ణిసేన వెలకట్టడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సినిమా కళాకారులను బెదిరించడం, వారిపై దాడులకు తెగబడితే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అసలు అలాంటి ప్రకటనలు ఇచ్చిన వాళ్ల వద్ద కోటిరూపాయలు ఉన్నాయో లేదో అని తనకు అనుమానంగా ఉందన్నారు. నిరసనలు తెలియజేయాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి తప్ప ఈ తరహా ప్రకటనలు చేయకూడదని వెంకయ్య హితవు పలికారు.