Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విడుదల తేదీ సమీపించేకొద్దీ పద్మావతిపై వివాదం పెరుగుతోంది. రాజ్ పుత్ ల చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ పద్మావతిని వ్యతిరేకిస్తున్న రాజ్ పుత్ కర్ణిసేన సినిమా విడుదలను ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మూవీ రిలీజ్ పై స్టే ఇవ్వాలన్న కర్ణిసేన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ ఈ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడలేదు. సినిమా రిలీజ్ కానున్న డిసెంబరు 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది కర్ణిసేన. బెంగళూరులో సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించిన అనంతరం రాజ్ పుత్ కర్ణిసేన నేత లోకేంద్ర సింగ్ కల్వి బంద్ విషయం వెల్లడించారు. సినిమా విడుదలకు నిరసనగా బంద్ నిర్వహిస్తామని తెలిపారు. కర్ణిసేనకు బీజేపీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సినిమా విడుదలను అడ్డుకుని తీరతామని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు.
ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, చిత్తోర్ రాణి పద్మిణి, రాజు రావల్ రతన్ సింగ్ జీవితాల ఆధారంగా… పద్మావతిని సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే రాజ్ పుత్ ల రాజసానికి చిహ్నంగా భావించే రాణి పద్మిణి, సుల్తాన్ ఖిల్జీకి సన్నిహితంగా ఉన్నట్టు చిత్రంలో చూపించారన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో పద్మావతిపై వివాదం చెలరేగింది. తొలి నుంచీ సినిమాను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు పద్మావతి విడుదలను ఎలాగైనా అడ్డుకోవాలని భావిస్తున్నాయి. అయితే సినిమాపై జరుగుతున్న ప్రచారాన్ని భన్సాలీ ఖండించారు. ఖల్జీ, పద్మావతి కలుసుకున్నట్టు సినిమాలో ఎక్కడా చూపించలేదని ఆయన స్పష్టంచేసినా ఆందోళనలు చల్లారడం లేదు. దీనిపై పద్మావతి హీరోయిన్ దీపిక పడుకునే కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
పద్మావతిగా నటించినందుకు గర్విస్తున్నానన్న దీపిక వివాదాలపై అసహనం వ్యక్తంచేసింది. మనం ముందుకు వెళ్తున్నామా… వెనక్కి వెళ్తున్నామా అని ప్రశ్నించింది. దీంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దీపిక వైఖరిని తప్పుబట్టారు. డచ్ దేశంలో పుట్టిన దీపికకు భారతీయుల మనోభావాలు అర్థంకావడం లేదని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపైనా కొత్త వివాదం చెలరేగింది. ఇలా వివాదాల మధ్య పద్మావతి నలుగుతోంటే… అటు ప్రేక్షకులకు మాత్రం సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పద్మవాతి ట్రైలర్, ఫస్ట్ లుక్, ఘూమర్ పాటకు నెట్ లో వచ్చిన స్పందనే దీనికి నిదర్శనం. విడుదలయ్యే దాకా ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే సినిమాకు మరింత హైప్ వస్తుంది. అలా రాజ్ పుత్ కర్ణిసేన, వారిని సమర్థించేవారు పద్మావతి విడుదలను అడ్డుకోలేకపోగా… సినిమా హిట్టవ్వడానికి పరోక్ష కారణం కానున్నారు.