పాక్ కక్కిన విషం…స్వాతంత్ర్యం కోసమట !

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడిపై అంతర్జాతీయ మీడియా సైతం సానుభూతి వ్యక్తం చేస్తుంటే పాకిస్తాన్ మీడియా మాత్రం విషం కక్కింది. నిన్న సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న కాన్వయ్‌పై ముష్కరులు ఆత్మహుతి దాడికి పాల్పడిన ఘటనలో 49 మంది జవాన్లు అమరులయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తామంటూ హెచ్చరించారు. ఈ దాడిపై అమెరికా సైతం పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని, వారికి ఆశ్రయం ఇవ్వడం నిలిపివేయాలని లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భారత్‌ను రెచ్చగొడుతున్న పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ప్రపంచ వేదికపై పాక్‌ను ఏకాకి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విదేశాంగ శాఖ చర్యలు ప్రారంభించిందని చెప్పారు. అత్యంత ప్రాధాన్యం ఉన్న దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జైట్లీ వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈరోజు ప్రధాని నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అయితే ముష్కర దాడిపై పాకిస్తాన్ మీడియా భిన్నంగా స్పందించింది. ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొంది. ‘ద నేషన్’ అనే పత్రిక ‘‘స్వాతంత్య్ర సమరయోధులు జరిపిన దాడిలో 44 మంది భారత ఆక్రమిత కశ్మీర్ (IOK) దళ సభ్యులు మృతిచెందారు’’ అని పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన Dawn పత్రిక.. ‘‘కశ్మీర్‌లో వేల సంఖ్యలో పౌరులు చనిపోవడానికి పాకిస్తానే కారణమని న్యూఢిల్లీ (ఇండియా) ఆరోపిస్తోంది. అయితే, ఇస్లామాబాద్ (పాక్) ఈ ఆరోపణలను ఖండించింది. కశ్మీరీల స్వీయ నిర్ణయ హక్కుకు దౌత్య సంబంధిత మద్దతు మాత్రమే పాకిస్తాన్ ఇస్తోంది’’ అని పేర్కొంది. ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ అనే పత్రిక పుల్వామా దాడి ఘటన వార్తలో కశ్మీర్‌ను ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అని పేర్కొంది. మరికొన్ని పత్రికలు కూడా పాక్‌కు అనుకూలంగానే వార్తలు రాశాయి. కశ్మీరీల తిరుగుబాటు చర్యగా ఈ దాడిని చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. మరోపక్క ‘‘పాకిస్థాన్‌కు ‘మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌’ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం. కశ్మీర్ ఉగ్ర దారుణం వెనుక పాక్‌ హస్తమున్నట్లు ఆధారాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. సైనికులపై దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై శనివారం అఖిలపక్షం నిర్వహించనున్నట్లు జైట్లీ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.