కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు…కొత్తవారే !

KCR New Cabinet Opening Date And Time Fixed

తెలంగాణలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు కానీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో ఆశావహులు, సాధారణ ప్రజలు కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. వచ్చే మంగళవారం అంటే ఫిబ్రవరి 19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున శుభ ముహూర్తంలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ నరసింహన్‌ ను కలిసిన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అనంతరం ప్రభుత్వం అధికారంగా సమాచారం వెల్లడించింది. 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడుస్తుండటం, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఆర్ధికశాఖ మంత్రిని నియమించి ఆయన చేత బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టించాలని సీఎం భావిస్తున్నారు. కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఏయే సామాజిక వర్గాలకు ఎలా ప్రాధాన్యమివ్వాలి అనే అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశారు. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి వివిధ సమీకరణలు, గత అనుభవాల రీత్యా మంత్రివర్గాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన పలువురు సభ్యులకు ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం లేనట్లు చెబుతున్నారు. తక్కువ సంఖ్యలో పలువురు పాత మంత్రులతో పాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది.