నీరు ఇవ్వకపోయినా పాక్ కు నష్టం లేదట !

Pak Sensenstinl Comments On Water

పుల్వామా ఉగ్రదాడి తర్వాత తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్, పాకిస్థాన్ విషయంలో మరింత కఠినంగా ఉండాలని భావించి సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన మన వాటా నీటిని పాకిస్థాన్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్థాన్‌లోకి ప్రవహించే మన వాటా జలాల్ని ఆపెయ్యాలని నిర్ణయించిందని, తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించి, జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌ ప్రజలకు అందిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాకిస్థాన్, సింధు జలాలను భారత్ ఆపేసినంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని, ఎలాంటి ఆందోళన చెందడం లేదంటూ ఆ దేశ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాలీ పేర్కొన్నారు. తమ అధికారిక పత్రిక డాన్‌తో మాట్లాడిన ఆయన తూర్పు ప్రాంతంలోని నదీ జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరమూ, ఆందోళనా లేదని భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల తామేమీ బాధపడటం లేదని వ్యాఖ్యానించారు. అయితే తమ వాటా కింద వచ్చే సింధు, జీలం, చీనాబ్‌ నదీ జలాలను అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తామని అన్నారు. అలాగే, 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల నీటిని భారత్ మళ్లించుకుందని, ఆ సమయంలోనూ తాము అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు అదే పని చేస్తున్నామని అన్నారు.