తెలంగాణా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఫైనల్ చేసిన కేసీఆర్ !

Telangana Ministers Kcr

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. హోం శాఖ మంత్రి ఎండి మెహమూద్ అలీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కురుమ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ లను టిఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేశారు కేసీఆర్. ఇక మరొక సీటును మిత్ర పక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గులాబీ బాస్ జాబితా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 12 వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతోంది. మార్చి 15వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంతోష్ కుమార్, మహ్మద్ సలీం పదవీకాలం పూర్తి కానుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారని అర్ధం అవుతోంది.