స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ నాజిర్ జంషెడ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డుకు చెందిన అవినీతి నిరోధక ట్రిబ్యునల్ పదేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2016-17 సీజన్‌లో ఆడుతున్న ఒక మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ట్రిబ్యునల్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఏడాది కాలంగా జంషెడ్‌పై నిషేధం కొనసాగుతోంది. శుక్రవారం తుది తీర్పును వెల్లడించిన ట్రిబ్యునల్ ఏకంగా పదేళ్లు నిషేధం విధించింది.
ఈ పదేళ్లలో క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో జంషెడ్ పాల్గొనకూడదు. జంషెడ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కిందటేడాది ఫిబ్రవరిలో నేషనల్ క్రైం ఏజెన్సీ అతన్ని అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను బెయిల్‌పై విడుదలై యూకేలో ఉంటున్నాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. పీసీబీ యాంటీ కరప్షన్ కోడ్‌లోని ఏడు నియమాల్లో ఐదింటిని జంషెడ్ ఉల్లంఘించినట్లు తేల్చింది. దీంతో జంషెడ్‌ను దోషిగా తేల్చి పదేళ్ల నిషేధం విధించింది.