Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు. తన అద్వితీయ ప్రతిభతో దేశానికి మూడు ఒలంపిక్ పతకాలను సాధించిపెట్టడంతో పాటు చిరస్మరణీయ విజయాలు ఎన్నో అందించాడు. ఆ క్రమంలో స్వదేశానికి సంతోషాన్ని, దాయాది దేశమైన ప్రత్యర్థికి బాధను కలిగించాడు. తన ఆటతీరుతో ఇంటా, బయటా పేరు, ప్రఖ్యాతులను, ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదంతా జరిగి దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పడు ఆయన అనారోగ్యంతోనూ, ఆర్థిక సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఆటగాడిగా ఒకప్పుడు తాను బాధను నింపిన దేశానికే చికిత్సకోసం రావాలనుకుంటున్నాడు. కానీ దాయాది దేశం సహకరిస్తుందో లేదో అన్న అనుమానం ఆయన్ను వెంటాడుతోంది. అందుకే తన ఆవేదననంతా వ్యక్తీకరిస్తూ విన్నపం చేస్తున్నాడు. ఎందరో గుండెల్లో బాధను నింపిన తాను ఇప్పుడు గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, చికిత్సకు సహకరించాలని కోరుతున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు మన్సూర్ అహ్మద్ వ్యథ ఇది.
హాకీ క్రీడాకారుడిగా ఎన్నో ఘనతలు సాధించిన మన్సూర్ ఇప్పుడు అనారోగ్యంతో కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు. పంజాబ్ ముఖ్యమంత్రి షరీఫ్, మన్సూర్ చికిత్స నిమిత్తం లక్ష డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ ఫౌండేషన్ అతని వైద్యానికయ్యే ఖర్చును భరిస్తోంది. మన్సూర్ కు ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరమొచ్చింది. మన్సూర్ కు చికిత్స అందిస్తున్న వైద్యుడు పర్వేజ్ శస్త్రచికిత్స కోసం భారత్ లేదా కాలిఫోర్నియా వెళ్లాలని సూచించాడు. కాలిఫోర్నియా, భారత్ రెండింటిలో మన్సూర్ మనదేశాన్నే ఎంచుకున్నాడు. శస్త్రచికిత్స కోసం తాను భారత్ వెళ్లాలనుకుంటున్నానని, ఎందుకంటే భారత్ లోనే ఈ శస్త్ర చికిత్స సక్సెస్ రేటు ఎక్కువగా ఉందని, అంతేకాకుండా కాలిఫోర్నియాతో పోలిస్తే ఖర్చు కూడా తక్కువని మన్సూర్ చెప్పాడు. దయచేసి సాయంచేయాల్సిందిగా భారత్ ను కోరాడు. తాను డబ్బులు అడగడంలేదని, నైతికసాయం కావాలని విజ్ఞప్తిచేశాడు.
ఇప్పటికే రిపోర్టులను పంపించానని, వీసా కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. తాను ఎంతో మంది భారతీయుల గుండెల్లో బాధను నింపానని, భారత్ పై ఎన్నో టోర్నీల్లో గెలిచి వారి బాధకు కారణమయ్యామని, కానీ ఇప్పుడు తాను గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం భారత్ రావాలనుకుంటున్నానని, భారతప్రభుత్వం నుంచి సాయం కావాలని కన్నీరు పెట్టుకున్నాడు. 1989లో ఇందిరాగాంధీ కప్ టోర్నీలో భారత్ ను పాక్ ఓడించింది. పాక్ విజయంలో మన్సూర్ కీలకపాత్ర పోషించాడు. దీంతో పాటు ఎన్నో టోర్నీలో మన్సూర్ పాక్ జెండా రెపరెపలాడించాడు. 1994లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ లో పాక్ విజేతగా నిలవడానికీ మన్సూరే కారణం. గోల్ కీపర్ గా జట్టుకు సేవలందించాడు. మూడు ఒలంపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి మన్సూర్ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దీనస్థితిలో ఉండడం, శస్త్ర చికిత్స కోసం ఆయన భారత్ కు రావాలనుకోవడంపై నెటిజన్లు చలించిపోయారు.
భారత్ ను ఓడించారన్న కోపం మన్సూర్ పై ఎవరికీ లేదని, భారతీయులు ఎంతో క్రీడాస్ఫూర్తి కలవారని, మన్సూర్ వైద్యానికి, భారత్ ను మ్యాచ్ ల్లో ఓడించడానికి సంబంధం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఆయన కోరుకున్నట్టుగా భారత్ వచ్చి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సుష్మాస్వరాజ్ కు విజ్ఞప్తిచేస్తున్నారు. నిజానికి వైద్యం వంటి అత్యవసర సేవల విషయంలో భారత్ ఎప్పుడూ పాకిస్థాన్ పౌరులకు ఇబ్బందులు కలిగించలేదు. పాక్ కు చెందిన ఎందరో చిన్నారులకు గుండె సంబంధిత చికిత్సలను భారత్ ఉచితంగా అందించింది. ఈ విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. మన్సూర్ ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని త్వరలోనే ఆయనకు భారత్ వచ్చి చికిత్స చేయించుకునే అవకాశం కలుగుతుందని భరోసా ఇస్తున్నారు.