పాక్ ప్రధాని సంధి మాటలు…కానీ ఉపయోగం లేదు !

Pakistan President Imran Khan Comments About War

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత్‌పై యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇస్లామాబాద్ రావల్పిండిలో సివిల్ డిఫెన్స్ సైరన్‌లను మోగించింది. ఇలా చేయడమంటే యుద్ధానికి సంకేతం. గత కొన్నేళ్లుగా సివిల్ డిఫెన్స్ సైరన్‌లను పాక్ మోగించలేదు. పౌరులను అప్రమత్తం చేసేందుకు ఇప్పుడు సైరన్ల మోత మోగించింది. మరోవైపు శ్రీనగర్, రాజౌరీలో భారత్ గగనతల నిషేదాజ్ఞలు ప్రకటించింది. నో ఫ్లైయింగ్ జోన్లుగా ప్రకటించి విమానాల రాకపోకలపై నిషేదాజ్ఞలు విధించింది. జమ్మూకశ్మీర్‌లో పలు విమానాశ్రయాల్లో హై అలర్టు ప్రకటించిన అధికారులు పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. అమృతసర్, చండీగఢ్‌లోనూ విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు.

పాక్‌పై భారత వాయుసేన దాడుల తర్వాత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ భూభాగం నుంచి పాక్ బలగాలు భారత్ వైపు నిరంతరాయంగా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. మరోవైపు యురి సెక్టార్‌లో నక్కిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరపడంతో భారత్ బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. భారత గగనతలంలోకి పాక్ వినామాలు దూసుకువచ్చాయి. రాజౌరీ, నౌషెరా సెక్టార్‌లోకి చొరబడ్డాయి. పలు చోట్ల బాంబులు జారవిడిచాయి. వెంటనే స్పందించిన భారత సైనికులు ఎదురుదాడికి దిగడంతో పాక్ విమానాలు తోకముడిచాయి. అయితే పాక్ యుద్ధ విమానాన్ని భారత్‌కు చెందిన రెండు మిగ్-21 విమానాలు వెంబడించాయని.. అందులో ఒకటి పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేయగా.. మరోటి మిస్సయిందని రవీశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మిగ్‌ పైలట్‌ తమ అదుపులో ఉన్నాడని పాక్‌ చెప్పినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే పాక్ ప్రధాని మాటలు మరో విధంగా ఉన్నాయి. పుల్వామా దాడి చేసింది తామే అని పాక్ ఆధారిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చెబుతున్నా, ఆధారాలు లేవంటూ తాజాగా భారత్‌ ను చర్చల కోసం ఆహ్వానించారు. పుల్వామా ఘటన అనంతరం భారత్‌కు మేము శాంతి ప్రతిపాదన చేశామని పుల్వామా దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. పలు ఆస్పత్రులను సందర్శించి, హింస కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి బాధను నేను కళ్లారా చూశానంటూ ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరుపుతామని తాము ఇప్పటికే భారత్‌కు చెప్పామనీ భారత్‌కు సహకరించేందుకు కూడా తాము సిద్ధమని చెప్పామన్నారు.

భారత్ ఇప్పటికీ చర్యలు తీసుకునే యోచనలో ఉందన్న ఉద్దేశంతోనే దాడులకు ప్రతిదాడులు ఉంటాయని చెప్పాను. నిన్న ఉదయం భారత్ మమ్మల్ని కష్టపెట్టినప్పటికీ మా వైమానిక దళాలను తొందర పడొద్దని చెప్పాననీ భారత్ చర్యల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేవరకు ముందుకెళ్లొద్దని సూచించానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇవాళ పాక్ వైమానిక దళాలు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించడంపైనా ఆయన స్పందించారు. మీరు మా దేశంలోకి అడుగుపెడితే, మేము కూడా అదేపని చేయగలమని చెప్పేందుకు మాత్రమే మేము ఇలా స్పందించాం. వాళ్లకు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశాం. ఇక ఇక్కడి నుంచి మేము మరింత తెలివిగా వ్యవహరిస్తామని ఆయన పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. మీ దగ్గరున్న ఆయుధాలు, మా దగ్గరున్న ఆయుధాలతో తలెత్తే పరిణామాలను తట్టుకోగలమా అని భారత్‌ను అడిగాననని ఇదింకా ముదిరితే నా చేతుల్లోగానీ, మోదీ చేతుల్లో గానీ ఏమీ ఉండదంటూ యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు వదిలారు. ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం.. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన పేర్కొన్నారు. అయితే పాక్ ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా సైన్యం ముందు కీలుబోమ్మలె అని ఆయన మాటలు పట్టించుకోవక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.