జగన్ పార్టీలో చేరిన ఎన్టీఆర్ మామ !

Narne Srinivasa Rao Join In YCP

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, నార్నె సంస్థల అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సమీప బంధువు నార్నె శ్రీనివాసరావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. లోటస్ పాండ్ లో పార్టీ అధినేత జగన్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నార్నె వైసీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను పార్టీలో చేరడానికి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని నార్నె పేర్కొన్నారు. వైసీపీలో చేరిన అనంతరం నార్నె మీడియాతో మాట్లాడారు.

తాను గత పదేళ్ల నుంచి వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి టికెట్ ఆశించడం లేదని టికెట్ కోసం పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. నార్నె వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం రాగానే ఎన్టీఆర్ కూడా జగన్ కి మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా దీనిపై నార్నె వివరణ ఇచ్చారు. తాను వైసీపీలో చేరడానికి తన అల్లుడు జూ.ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. తాను ఏ స్థానాన్నీ ఆశించడం లేదని, జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని, అందుకే పార్టీలో చేరానని స్పష్టం చేశారు.