పాకిస్థాన్ ఎంత దుర్మార్గమైనదేశమో మరోసారి రుజువయింది. పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు ఆయన తల్లి, భార్యకు సోమవారం పాక్ అధికారులు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జైలు అధికారుల అనుచిత ప్రవర్తన ఆలస్యంగా వెలుగుచూసింది. జాదవ్ భార్య , తల్లితో వారు కనీస సభ్యత కూడా పాటించకుండా వ్యవహరించారు. భద్రతపేరుతో హిందూ మత మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.
మొదట జాదవ్ భార్య చెప్పులు తీసుకున్న పాక్ జైలు అధికారులు తర్వాత ఆమె మంగళసూత్రం, గాజులు, ఆఖరికి బొట్టు కూడా తీయించారు. దుస్తులు మార్చుకోవాలని కూడా బలవంతంచేశారు. అంతేకాకుండా జాదవ్ తో ఆయన తల్లిని, భార్యను మాతృభాషలో కూడా మాట్లాడనివ్వలేదు. జాదవ్ తల్లి పలుమార్లు కొడుకుతో ప్రేమగా సొంత భాషలో మాట్లాడేందుకు ప్రయత్నించగా పాక్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. భారతవిదేశాంగశాఖ ఈ వివరాలు వెల్లడించింది. అటు కులభూషణ్ భార్య, తల్లితో మాట్లాడుతున్న ఫొటోలో అతని చెవి,మెడ వద్ద గాయాలు కనిపించాయి. దీన్ని చూసినవారంతా ఆయన్ను జైల్లో పాకిస్థాన్ చిత్రహింసలు పెడుతోందని ఆవేదనవ్యక్తంచేస్తున్నారు.