జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ మంగళవారం స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి శ్రీనగర్–షార్జా నగరాల మధ్య డైరెక్ట్ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది.
అక్టోబర్ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ పాక్ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్ కరాఖండీగా చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్ సంస్థ నుంచి సైతం ఎలాంటి స్పందన రాలేదు.