Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే పాకిస్థాన్ క్రికెట్ ప్రేక్షకులకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కోహ్లీపై ఏ చిన్న విమర్శ వచ్చినా… భారతీయుల కంటే ముందుగా పాకిస్థానీలు స్పందిస్తారు. తమ అభిమాన క్రికెటర్ కు మద్దతుగా చేసే ట్వీట్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతారు. టీచర్స్ డే సందర్భంగా కోహ్లీ.. ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసినప్పుడు పాకిస్థాన్ అభిమానులు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. క్రికెట్ లో దిగ్గజాలుగా చెప్పుకునేవారి పేర్లన్నీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా.తాను ఓ మంచి విద్యార్థిలా వారిముందు కూర్చుని ఉన్నట్టుగా కోహ్లీ ఓ ఫొటో పోస్ట్ చేశాడు.
ఆ దిగ్గజాల జాబితాలో భారత బౌలింగ్ దిగ్గజం, మాజీ కోచ్ కుంబ్లే పేరు లేదు. కుంబ్లేతో వివాదాల నేపథ్యంలో కావాలనే కోహ్లీ ఆయన పేరు ఉంచలేదు. దీంతో భారత అభిమానులు కోహ్లీపై విరుచుకుపడ్డారు. కుంబ్లేను మరిచావా…అంటూ సీనియర్లకు ఎలా గౌరవం ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పాకిస్థానీలు మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచారు. విరాట్ పోస్ట్ చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా…భారత పర్యటన సమయంలోనూ కోహ్లీని ఉద్దేశించి ఆ దేశ మీడియా చేసిన వ్యాఖ్యలపైనా పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆస్ట్రేలియా టీం ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థానీలు కోహ్లీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కొత్త పెళ్లికొడుకుగా ఉన్న విరాట్ పై మరోసారి తమ అభిమానం ప్రదర్శించారు. ఇటీవల అనుష్క హనీమూన్ లో దిగిన ఓ సెల్ఫీని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంచుకొండల్లో భర్తతో దిగిన ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ అనుష్క స్వర్గంలో ఉన్నా…నిజంగా అని కామెంట్ పెట్టింది. ఈ ఫొటో నెట్ లో వైరల్ గా మారింది. అయితే కోహ్లీ పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడీ ఫొటోను ఫోటోషాప్ చేశారు. తమ అభిమాన క్రికెటర్ దంపతులు తమ దేశానికి హనీమూన్ వచ్చినట్టుగా…కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేశారు. విరుష్క లాహోర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు పాక్ లోని ప్రముఖ ప్రదేశాలు, రెస్టారెంట్లముందు సెల్ఫీ దిగినట్టుగా ఎడిట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి విరాట్ పై తమ అభిమానాన్ని ఈ రూపంలో చూపిస్తున్నారు పాకిస్థానీలు.