అవును మీరు చదివింది నిజమే ఆ ఎమ్మెల్యే రాత్రంతా శ్మశానం లోనే ఉన్నారు. నేటి వాస్తవ పరిస్థితులకి తగ్గట్టు ఆయనేదో కుద్ర పూజ చేయడానికి వెళ్ళుంటాడు అని మీరు అనుకోవచ్చు, కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు విషయంలోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాత్రంతా శ్మశాన వాటికలోనే ఉన్నారు. అక్కడ స్థానిక హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రతివారం సమీక్షిస్తున్నారు, రోజూ పరిశీలిస్తున్నా పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో వారం రోజుల పాటు ఆయా పనుల వద్దే పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. శ్మశాన వాటిక కావడంతో అవాంతరాలు చోటుచేసుకోవడంతో అక్కడ పనిచేసేందుకు కొందరు కార్మికులు వెనుకడుగు వేస్తున్నారు.
కార్మికులలో మనో ధైర్యాన్ని నింపేందుకు రాత్రంతా ఆ నేత అక్కడే బస చేశారు. అప్పటికప్పుడే కుర్చీ, బల్ల ఏర్పాటు చేసుకుని రాత్రి పది గంటల వరకు పనులపై సంబంధిత పురపాలక ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారులతో సమీక్షించారు. ఈ ప్రాంతం అంధకారంతో నిండిపోవడంతో బ్యాటరీ దీపంలోనే గడిపారు. అంతేకాక ఆ బ్యాటరీ దీపం వెలుగులోనే శ్మశానంలోనే భోజనం చేసి.. కార్మికులతో రాత్రంతా అక్కడే గడిపి.. మడత మంచంపై విశ్రమించి, తిరిగి ఉదయం అక్కడే స్నానం చేశారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. రాజకీయాలు కాసేపు పక్కన పెడితే నేటి సమాజానికి కావాల్సింది ఇటువంటి ప్రజా ప్రతినిధులే కదా, సొంత లాభం కొంతమానుకు తోటివాడికి పాటుపడవోయ్ అన్నాడో మహా కవి, కాని రాజకీయాల్లో ఉన్నవారు సొంత లాభం అంతా మానుకుని ప్రజల కష్ట, సుఖాలు తనవిగా బావించినపుడే నిజమయిన నాయకుడు అవుతాడు.