బాబు , పవన్ మధ్య రహస్య చర్చల్లో.

Chandrababu And Pawan secret meet about ap politics

ఆరేడు నెలల కిందట దాకా చంద్రబాబు మీద పవన్ ఒక్క మాట పడనీయలేదు. ఈ ఆరేడు నెలల్లో ఒక్కసారి కూడా పోనీలే పాపం అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సమస్యకి చంద్రబాబు పాలనే కారణం అన్న రీతిలో పవన్ ముందుకు వెళుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ అందుకు సిద్ధం అవుతున్నారు అనడానికి ఈ వ్యాఖ్యలే పెద్ద ఉదాహరణ. ఈ వ్యవహారం చూసాక మొన్నటికి మొన్న కూడా టీటీడీ కి సంబంధించి రమణదీక్షితులు ఆరోపణలకు మద్దతుగా పవన్ మాట్లాడడం చూసాక ఇక టీడీపీ , జనసేన మధ్య సయోధ్య అన్న ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. అందుకే లింగమనేని సంస్థ నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చిన పవన్ ని పలకరించడానికి టీడీపీ నాయకులు వెనకాడారు. అక్కడే వాళ్ళ అంచనాలు తప్పాయి.

రాజకీయంగా ఎలాంటి వాతావరణం నెలకొన్నప్పటికీ పూజ సందర్భంగా చంద్రబాబు , పవన్ మధ్య అభివాదాలు , చిన్న చిన్న మాటలు కలిసాయి. అది కేవలం మర్యాద కోసమే అనుకుంటే ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆ ఇద్దరూ కలిసి గణపతి సచ్చిదానంద స్వామి పిలుపు మేరకు ఒకే గదికి వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరికీ స్వామీజీ తీర్ధ ప్రసాదాలు అందించారని బయటకు వచ్చిన మాట. అయితే లోపల ఓ ఇరవై నిమిషాల పాటు ఆ ఇద్దరి మధ్య స్వామిజీ సమక్షంలో చర్చలు జరిగినట్టు ఇంకో వాదన వినిపిస్తోంది. ఆ చర్చలు రాష్ట్ర రాజకీయాల చుట్టూ జరిగాయని బలంగా వినిపిస్తోంది. అయితే టీడీపీ ,జనసేన మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం కొనసాగాక ఈ చర్చలతో ఫలితం ఉండబోదని , ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే అని ఇంకో వాదన. పవన్ ని దెబ్బ కొట్టడానికి వైసీపీ ఈ వాదనను ముందుకు తెచ్చిందని కూడా ఇంకొందరి అభిప్రాయం.

ఇందుకు బలం చేకూర్చే ప్రకటన ఒకటి కూడా బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ , జనసేన కలిసి పనిచేస్తాయని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది కానీ అంత కన్నా కీలక నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అందుకు పూర్తి భిన్నం అయిన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తమకి మద్దతు ఇచ్చినా , ఇవ్వకపోయినా వైసీపీ మాత్రం ఒంటరి పోరు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ఓ విధంగా పవన్ ని తీసిపారేయడమే. ఇందుకు కారణం వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యక్రమం సందర్భంగా బాబు , పవన్ మధ్య రాజకీయ చర్చలు జరిగినట్టు జగన్ కి సమాచారం అందడమేనట. మొత్తానికి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రాన్ని స్పష్టం చేసే దాకా బాబు , పవన్ మధ్య చర్చల గురించి ఈ తరహా పుకార్లు షికార్లు చేయడం సర్వసాధారణం.