పవన్ ఓకే అన్నా….పోటీ పోటీనే !

ummareddy says there is no alliance with Pawan Kalyan

పవన్ ఈసారి జగన్ కే మద్దతు పలుకుతానని తనతో చెప్పాడని పవన్ కి సన్నిహితుడు మాజీ ఐఏఎస్ ప్రస్తుత వైకాపా మాజీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల మీద పవన్ అయితే ఇంకా స్పందించలేదు. అయితే పవన్ ని తమ వైపుకు తిప్పుకునేందుకే ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేస్తున్నారు అని కొందరు టీడీపీ నాయకులు ఆరోపిస్తుండగా వైసీపీ సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారాయి. తమకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినా ఎన్నికల్లో తాము ఒంటిగానే పోటీ చేస్తామన్నారు వైపీసీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వరప్రసాద్ వ్యాఖ్యల పై స్పందించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ… “ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోదు.. పవన్ మద్దతిస్తాడేమో.. ఆయన పోటీ చేయకుండా మద్దతు ఇవ్వచ్చు.. ఇస్తే ఇవ్వనివ్వండి. ఆయన మద్దతిచ్చినా మేము మాత్రం పొత్తు పెట్టుకోకుండానే పోటీ చేస్తాం” అని వ్యాఖ్యానించారు.

కాగా, ప్రజల సమస్యలపై టీడీపీ నాయకులు ఇప్పటివరకు రాజీనామాలు చేయలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ ఎంపీలు రాజీనామా చేశారని, అయితే వారిని కూడా కొందరు విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు రచించిన రాజ్యాంగమే అమలవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర ప్రగతి కుంటుబడుతోందని ఆయన ఆభిప్రాయపడ్డారు. హామీలు నెరవేర్చడంలో టీడీపీ, బీజేపి నాయకులు చిత్తశుద్ధి లేదని ఉమ్మారెడ్డి ఆరోపించారు. హోదా కోసం మొదటి నుంచి పట్టుబట్టింది వైసీపీనేనని ఆయన గుర్తు చేశారు. స్పెషల్ స్టేటస్ కోసం విద్యార్థులు పోరాటం చేస్తే పీడి యాక్టు అమలు చేస్తామని చంద్రబాబు బెదిరించారని అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అంటు రాష్ట్రమంతా తెగ తిరుగుతున్నారని ఆయన చంద్రబాబుని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొక్కుబడిగా రెండుసార్లు అసెంబ్లీలో హోదాకోసం తీర్మానం చేయించిందని తెలిపారు. తప్పని పరిస్థితిల్లో హోదా కోసం చంద్రబాబు యూటర్న తీసుకొన్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు.