Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడానికి విలక్షణ నటుడు కమల్ హాసన్ ఎంత ఆరాటపడుతున్నాడో అంతగా అద్డంకులు కూడా ఎదురు అవుతున్నాయి. రాజకీయ పార్టీ ఏర్పాటుకి ముందు కమల్ హాసన్ గురించి మాట్లాడేందుకు డిఎంకె, అన్నాడీఎంకే లాంటి పార్టీలు కాస్త సందేహంలో పడ్డాయి. రాజకీయ ప్రస్తానం తెలియని కమల్ ని ఏ విషయంలో టార్గెట్ చేయాలి అన్నది కూడా ఆయా పార్టీలకు ఇబ్బందిగా మారింది. దీంతో కమల్ ని చూసీచూడనట్టు వదిలేసిన పార్టీలు ఆయన విమర్శలకి ప్రతివిమర్శలు చేయకుండా ఎక్కువ కాలం వుండలేకపోయాయి. అందుకే ఇప్పుడు కమల్ వ్యక్తిగత జీవితాన్ని తెర మీదకు తెస్తున్నాయి.
కమల్ చేసుకున్న పెళ్లిళ్లు, గౌతమితో సహజీవనం గురించి ఇంతకుముందు తమిళ రాజకీయ పార్టీలు మాట్లాడలేదు. అయితే గడిచిన నెలరోజులుగా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కమల్ వ్యక్తిగత జీవితం గురించి డిఎంకె , అన్నాడీఎంకే కి చెందిన ప్రధాన పార్టీల నాయకులు గొంతు ఎత్తుతున్నారు. కొందరు చోటామోటా నాయకులు అయితే కమల్ మీద కాస్త దూకుడుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కమల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. “ గౌతమికి వివిధ సినిమాల్లో చేసిన పనికే డబ్బులు చెల్లించని కమల్ ఇప్పుడు తమిళ ప్రజలకు ఏదో చేస్తాడని చెబితే నమ్మేది ఎవరు ? “ అని తమిళ సీఎం పళనిస్వామి కామెంట్ తో కమల్ అభిమానులు వులిక్కిపడ్డారు. ఆరంభమే ఇంత ఘాటుగా ఉంటే మున్ముందు కమల్ వ్యక్తిగత జీవితం గురించి ఇంకెన్ని విమర్శలు వస్తాయో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కమల్ కూడా ఈ విమర్శలకు సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. మొత్తానికి వ్యక్తిగత జీవితం కమల్ రాజకీయ ప్రయాణానికి బ్రేకులు వేసేలా వుంది.