విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం దర్శకుడు పరుశురామ్‌కు ఇస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు పరుశురామ్ తీసిన సరికొత్త విధానం అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పరుశురామ్‌తో సినిమాలు చేసేందుకు యూత్ ఆడియన్స్ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. గీత గోవిందం విడుదల అయ్యిందో లేదో అప్పుడే ఆయన తర్వాత సినిమా విషయంలో అప్పుడే అధికారిక ప్రకటన వచ్చేసింది.
పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న తదుపరి చిత్రాన్ని కూడా గీతాఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ బ్యానర్లో శ్రీరస్తు సుభమస్తు, గీత గోవిందం చిత్రాలను చేసిన పరుశురామ్ వరుసగా మూడవ చిత్రాన్ని కూడా అదే బ్యానర్లో చేయబోతున్నాడు. వరుసగా మూడు చిత్రాలను ఇప్పటి వరకు ఏ దర్శకుడు కూడా గీతా ఆర్ట్స్‌లో చేసింది లేదు. ఆ అరుదైన రికార్డును పరుశురామ్ దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా గీత ఆర్ట్స్ బ్యానర్ పీఆర్ఓ ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడి కానున్నాయి. మెగా హీరోతో పరుశురామ్ తదుపరి చిత్రం ఉంటుందనే ఊహాగాణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గీత గోవిందం హడావుడి పూర్తి అయిన తర్వాత పరుశురామ్ తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.