Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని 25 ఏళ్ళపాటు ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రమణదీక్షితులు మొదలు పెట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఇటు రమణదీక్షితులు సైతం తగ్గకుండా టీటీడీపై దాడి కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత జగన్ ని కలిసి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యూహాత్మకంగానే దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆయన సాగిస్తున్న దాడిపై తగిన చారిత్రక ఆధారాలతోనూ, న్యాయపరంగానూ ప్రతిదాడి చేయాలని టీటీడీ కూడా సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలోనే నిన్న శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందకు మరమ్మతులు జరిగిన వకుళమాత పోటును టీటీడీ చూపించింది. అయితే టీటీడీ అధికారులతో పాటు పోటును సందర్శించిన ఆయన పోతూలో తవ్వకాలు జరగలేదని నిర్ధారించారు. అలాగే సంపంగి ప్రాకారంలో ప్రసాదాల తయారీ ప్రాంతాన్ని కూడా పరిపూర్ణానంద స్వామికి చూపించి రమణ దీక్షితులు చేస్తున్న అసత్య ఆరోపణల వల్ల నివ్రుత్తమయ్యే అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది.
2001, 2007లో పోటు మరమ్మతుల కారణంగా సంపంగి ప్రాకారంలోనే ప్రసాదాలను తయారు చేశామని పరిపూర్ణానంద స్వామికి పోటు సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంలో రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాన్ని కూడా టీటీడీ చూపించింది. ఇవన్నీ పరిశీలించిన పిమ్మట రమణ దీక్షితులు ఆరోపణలపై పరిపూర్ణానంద స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ వ్యవహారంపై యావత్తు దేశంలోని సాధువులు విస్మయం చెందుతున్నారని, అలాగే, భక్తుల్లో కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొందని అన్నారు. రేపు తిరుపతిలో జరగబోయే సమావేశంలో స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారని, ఈ సమావేశంలో ఈ వ్యవహారంపై, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై చర్చిస్తామని ఆ తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం ముందు ఉంచుతామని స్వామిజీ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిపూర్ణానంద చర్చల వల్ల రమణ దీక్షితులు మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆగమ శాస్త్రం గురించి రమణ దీక్షితులకి ఎంత అవగాహన ఉంటుందో ఈరోజు హాజరయ్యే పీటాదిపతులు అంతే అవగాహన కలిసి ఉంటారు. దీంతో ఇప్పుడు రమణ దీక్షితులు నెక్స్ట్ ఏమి చేస్తారో వేచి చూడాలి మరి.