శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ప్రయాణికులు! 

  Passengers flock to Srinagar airport

ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందంటూ అమర్ నాథ్ యాత్రను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు మరో యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిష్త్వర్ జిల్లాలో జరిగే మచైల్ మాత యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో, దుర్గామాత ఆలయం వరకు జరిగే మచైల్ యాత్రకు ప్రారంభ స్థానమైన 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉధంపూర్ వద్దే యాత్రికులను నిలిపివేశారు. ఈ సందర్భంగా కిష్త్వర్ జిల్లా కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రానా మాట్లాడుతూ, మచైల్ యాత్రను నిలిపి వేస్తున్నామని చెప్పారు. ప్రతియేటా మచైల్ దుర్గామాతను దర్శించుకునేందు భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు.

దీంతో శ్రీనగర్ నిట్ కాలేజీతో పాటు వందలాది సంఖ్యలో పర్యాటకులంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం రద్దీగా మారిపోయింది. అయితే అదే సంఖ్యలో విమానాలను ఎయిర్ లైన్స్ కంపెనీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలంతా పడిగాపులు కాస్తున్నారు.

వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలోనే కశ్మీర్ లో 35,000 మందికి పైగా బలగాలను మోహరించినట్లు కేంద్రం చెబుతున్నా, ఆర్టికల్ 35Aను ఎత్తివేసేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని కశ్మీర్ కు చెందిన రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో అనిశ్చితి నెలకొనే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలు ఏటీఎంలు, పెట్రోల్ బంకులు, నిత్యావసర వస్తువుల షాపుల ముందు క్యూ కట్టారు. కొన్ని రోజుల పాటుకు కావాల్సిన సరుకులను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు.